Mar 05,2022 21:38

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి.


కార్పొరేషన్‌దే బాధ్యత
ఇకపై ప్రతి వార్డు నుంచి గంగమ్మకు సారె
యూజర్‌ఛార్జీల్లో వాలంటీర్లకు 5శాతం ప్రోత్సాహక నగదు
తిరుపతి కౌన్సిల్‌లో తీర్మానం
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌
తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం శనివారం మేయర్‌ డాక్టర్‌ శిరీషా అధ్యక్షతన,ప్రత్యేక ఆహ్వనితులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో, డిప్యూటీ మేయర్లు భూమన అభినరు రెడ్డి, ముద్రనారాయణలు పాల్గొన్నారు.
తొలుత పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి నివాళి అర్పించారు. అనంతరం ఇకపై ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో తిరుపతి పుట్టినరోజు వేడుక జరుపుతామని మేయర్‌ డాక్టర్‌ శిరీష తెలిపారు. ఎంఎల్‌ఎ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి దాదాపు 600 సంవత్సరాల చరిత్ర ఉందని, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి చెల్లిగా కీర్తించబడుతూ ప్రతి ఏటా జరిగే జాతరకు టిటిడివారు సారెను తీసుకొస్తున్నారని, ఇకపై కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గంగజాతరను వైభవంగా జరపాలన్నారు. ప్రతి ఒక్క కార్పొరేటర్‌ వార్డు నుంచి గంగమ్మకు సారెను ఊరేగింపుగా తీసుకురావాలన్నారు. అనంతరం కమిషనర్‌ పిఎస్‌ గిరీషా అజెండాలోని అంశాలను వివరించారు. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఖచ్చితంగా శ్రీనివాస సేతు మీదుగా వెళ్లేలా తీర్మానం చేయాలన్నారు. అభినరురెడ్డి మాట్లాడుతూ తన వార్డు బాటలో వచ్చిన సమస్యలను వివరించారు. ఎరుకుల కాలనీ నుంచి కొర్లగుంట రోడ్డు, వైఎస్‌ఆర్‌ మార్గం కనెక్టివిటీ పాడై ఉన్నందున 49 లక్షలతో బాగు చేసేందుకు ఆమోదం లభించింది. కార్పొరేటర్‌ ఎస్‌కె బాబు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్‌ ముందున్న అంబేద్కర్‌ విగ్రహం ఆధునీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని, ప్రతి సచివాలయంలోనూ అంబేద్కర్‌ చిత్రపటం ఉండాలని సూచించారు. గత నాలుగు నెలలుగా 90 శాతం యూజర్‌ చార్జీలు వసూలు చేసిన 1225 మంది వాలంటీర్లకు వసూలైన 31,21,580 మొత్తం నుండి 5 శాతం ప్రోత్సాహక నగదుగా 1,56,079 రూపాయలను ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ హరిత, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మోహన్‌, డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి, ఎంఈలు చంద్రశేఖర్‌, వెంకట్రామిరెడ్డి, ఆర్‌.ఎఫ్‌.ఓ జ్ఞానసుందరం, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్‌, లోకేష్‌ వర్మ, హెల్త్‌ ఆఫిసర్‌ డాక్టర్‌ హరికష్ణ పాల్గొన్నారు.