ఎంఎల్‌ఎ కరుణాకర్‌రెడ్డికి ఇబ్బందులు
టిటిడి ఛైర్మన్ లెక్కచేయడం లేదన్న బాధ
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
ముఖ్యంగా అన్నమయ్య రహదారి అభివృద్ధి, తిరుపతిలో హోటళ్లు, ఫాస్టుఫుడ్ సెంటర్ల ఎత్తివేత ప్రభావం తిరుపతివాసులపై ఉంటుంది. ఈ నేపథ్యంలో తన ఓటుబ్యాంకుకు ఇబ్బంది కలిగిస్తున్న టిటిడి నిర్ణయాలపై భూమన కరుణాకర్‌రెడ్డి గుర్రుమని ఉన్నారు. నిర్ణయాలు చేసిన ప్రతిసారీ టిటిడి ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టీపట్టనట్లు ఉండడంతో టిటిడి నిర్ణయాల ఎఫెక్ట్ 'స్థానికుల్లో' వెల్లువెత్తే నిరసనపై ఆందోళనతోనే ఉన్నారు. టిటిడి ఛైర్మన్ తన బాధను అర్ధం చేసుకోవడం లేదనే ఆవేదన కరుణాకర్‌రెడ్డిలో ఉన్నట్లు సమాచారం. రెండుసార్లు ఎంఎల్‌ఎగా గెలిచినా, రాజకీయంగా తగిన ప్రాధాన్యత దక్కలేదనే ఆవేదనకు తోడు, టిటిడి నిర్ణయాలు మరింత బాధిస్తన్నాయని సమాచారం.
రాజకీయాల్లో విలక్షణ నేత భూమన కరుణాకర్ రెడ్డి. రాడికల్ ఉద్యమ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారాయన. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డితో అతి సన్నిహితంగా మెలిగిన భూమన.... వైఎస్సార్ మరణం తర్వాత రాజకీయంగా వెనకబడ్డారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి ఆయనకి జగన్ సర్కారులో తగిన ప్రాధాన్యం లభించలేదు. ఈ విషయంలో భూమన అభిమానులు చాలా కాలంగా ఆగ్రహంగా ఉన్నారు. భూమన సైతం కాస్త మనస్థాపంగానే ఉన్నప్పటికీ ఎక్కడా ఆవేశపడకుండా నిగ్రహం పాటిస్తున్నారు. తనయుడు భూమన అభినయ రెడ్డిని తన వారసుడిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంపైనే ఆయన దష్టి సారిస్తున్నారు.
ఇంతటి క్లిష్ట సమయంలో టిటిడి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. తిరుమల కొండపైకి మూడో మార్గంగా చెబుతూ అన్నమయ్య రహదారిని అభివద్ధి చేస్తామని టిటిడి తీసుకున్న నిర్ణయం కరుణాకర్ రెడ్డి కి ఇబ్బందులు తెచ్చి పెట్టింది. అన్నమయ్య మార్గం అందుబాటులోకి వస్తే తిరుపతి ప్రాధాన్యం పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. తిరుపతి నగరం తో సంబంధం లేకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తిరుపతి - కోడూరు రహదారిలో ఈ అన్నమయ్య మార్గం గుండా తిరుమల కొండ పైకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. దీంతో తిరుపతిలోని వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు మూసుకో వలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రంగంలోని ముఖ్యులు ఈ విషయమై భూమన కరుణాకర్ రెడ్డి ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే భూమన, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కలిసి అన్నమయ్య మార్గం సరికాదని విన్నవించారు. అన్నమయ్య మార్గం అందుబాటులోకి వస్తే తిరుపతి ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, రాజకీయంగా కూడ పార్టీకి, తనకు తీవ్ర నష్టం అని భూమన వై.వి.సుబ్బారెడ్డికి విన్నవించారు. అయితే అవేవీ పట్టించుకోని వై.వి.సుబ్బారెడ్డి మొన్నటి పాలకమండలి సమావేశంలో అన్నమయ్య మార్గానికి పచ్చజెండా ఊపారు. ఇది కరుణాకర్ రెడ్డి కి ఇబ్బందికరంగా మారింది.
ఈ వ్యవహారం నుంచి బయటపడక ముందే టీటిడి తీసుకున్న మరో నిర్ణయం ఎమ్మెల్యే భూమన కు ఇబ్బందికరంగా మారింది. కొండపై ఉన్న ప్రైవేటు హౌటళ్లు అన్నింటిని తీసి వేస్తామని టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమల కొండపైన సుమారు రెండు వందల హౌటళ్లు ఉన్నాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మంది ఆధారపడి ఉన్నారు. ప్రైవేట్ హౌటళ్లు తీసివేస్తే వీటిని నమ్ముకున్న వారు రోడ్డున పడతారు. టీటీడీ ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కొండపై హౌటళ్ల యజమానులు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే భూమనను కలిశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.వారికి ఎలా సర్దిచెప్పాలో తెలియక ఎమ్మెల్యే భూమన ఇబ్బంది పడ్డారు. 'అది అమలు కాదు, ధైర్యంగా ఉండండి' అని భూమన సర్దిచెప్పి పంపాడట.
పాలకమండలి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు భూమన కరుణాకర్ రెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అయిన తనతో ఓ మాట మాత్రమైనా చెప్పకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆయన ఆవేదన చెందుతున్నారట. టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫీషియో హౌదాతో సభ్యుడిగా ఉన్నప్పటికీ తనను పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారని ఎమ్మెల్యే భూమన గుర్రుగా ఉన్నారట. ఈ నిర్ణయాలు తిరుపతిలో తన ఓటు బ్యాంక్ ను కొల్లగొడుతుందని ఆయన లోలోన మదనపడుతున్నారట. వీటి వెనుక పాలక మండలి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఉన్నారన్నది ఆయన అనుమానంగా చెబుతున్నారు. దీనిపై బాహాటంగా మాట్లాడడానికి ఆయన నిరాకరిస్తునప్పటికీ... కొందరు టిటిడి పెద్దలు తనను టార్గెట్ చేశారని కరుణాకర్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. చివరకు గరుడ వారధి ఫ్లై ఓవర్ విషయంలో తన ఆగ్రహాన్ని భూమన బాహాటంగా వ్యక్తం చేశారని చెబుతున్నారు. మొదటి దశ పూర్తయిన గరుడ వారధి ఫ్లై ఓవర్ ను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉంది. ఈ నిర్మాణంలో మేజర్ షేర్ హౌల్డర్ అయిన టిటిడికి చెందిన ముఖ్యులు సైతం ఇదే నిర్ణయంతో ఉన్నారు. అయితే ఏమి జరిగిందో తెలియదు.... కానీ సరిగ్గా మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి గరుడ వారధిని ఓపెన్ చేసేయమని, వాహనాలను అనుమతించమని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అట్టహాసంగా చేయాలనుకున్న కార్యక్రమం... చివరకు వేడుక లేకుండాపోయింది. టిటిడి ముఖ్యులతో సంప్రదించకుండానే ఎమ్మెల్యే భూమన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ పరిణామాలతో టీటీడీ పాలకమండలి చెందిన ఒకరిద్దరు ముఖ్యులతో భూమన కరుణాకర్ రెడ్డి కి పొసగడం లేదని చెబుతున్నారు. చివరకు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అన్న చర్చ ఇటు నగరవాసుల్లోనూ, అటు టీటీడీ వర్గాల్లోనూ కొనసాగుతోంది.










