Sep 20,2023 22:36

టిడ్కో కాలనీలకు మౌలిక వసతులు
ఈటీపీ ప్లాంట్స్‌కు సంబంధించి భూసేకరణ : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

టిడ్కో గహాలకు సంబంధించి మౌలిక వసతులు వేగంగా పూర్తిచేయాలని, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు మున్సిపాలిటీల పరిధిలోని ఈటిపి ప్లాంట్ల ఏర్పాటుకు భూసేకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ తెలపారు. బుధవారం ఉదయం కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్‌ టిడ్కో అధికారులు, చిత్తూరు కమిషనర్‌, మున్సిపల్‌ కమిషనర్లు, తహశీల్దారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ చిత్తూరులోని కట్టమంచి, దొడ్డిపల్లి, కైలాసపురం ప్రాంతాలలో ఈటీపి ప్లాంట్లను నిర్మించాల్సి ఉందని అధికారులు కోరిన విధంగా భూసేకరణ చేయాలని చిత్తూరు తహసీల్దార్‌ మురళీ మోహన్‌ని ఆదేశించారు. అదేవిధంగా పలమనేరులోని పెద్దచెరువు వద్ద ఏర్పాటు చేయాల్సిన ఈటిపి ప్లాంట్‌కు వెంటనే భూసేకరణ చేయాలని అన్నారు. పుంగనూరులో ఏర్పాటు చేసే ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌కు స్థల సేకరణ పూర్తిచేసి మున్సిపల్‌ అధికారులకు అప్పగించాలని సూచించారు. మున్సిపల్‌ అధికారులు కోరిన విధంగా స్థలం సేకరించి వారికి ఇవ్వాలన్నారు. చిత్తూరు పుంగనూరులలో నిర్మిస్తున్న అర్బన్‌ హౌసింగ్‌ (టిడ్కో)లలో మౌలిక సదుపాయాల పనులు వేగంగా పూర్తి చేయాలని అక్టోబర్‌ 10వ తేదీ నాటికి పుంగనూరు అర్బన్‌ హౌసింగ్‌ కాలనీ అప్పగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పుంగనూరులో 1,536 గహాల సముదాయం చిత్తూరులో 2,850 గహాల సముదాయం పనులు వేగంగా నిర్వహించాలని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో చిత్తూరు నగరపాలిక కమిషనర్‌ అరుణ, పలమనేరు, పుంగనూరు కమిషనర్లు కిరణ్‌కుమార్‌, నరసింహ ప్రసాద్‌, పలమనేరు, పుంగనూరు తహసీల్దార్‌ కుప్పుస్వామి, సీతారాం, అర్బన్‌ హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.