Jul 08,2022 23:59

అసంపూర్ణ టిడ్కో ఇండ్లను పరిశీలిస్తున్న సిపిఎం బృందం

మౌలిక వసతులెక్కడ..!
గృహప్రవేశాలపై హడాహుడి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

టిడ్కో...టిడ్కో.. లబ్దిదార్ల గుండెలు లబ్‌డబ్‌ అని కొట్టుకోవడం కంటే టిడ్కో..టిడ్కో.. అంటూ ఎప్పుడు ఇంటితాళాలు చేతికిచ్చి గృహప్రవేశాలకు సిద్ధం కావాలనే శుభవార్త చెబుతారా అని ఆసక్తిగా వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. లక్షల రూపాయలు చెల్లించిన లబ్దిదార్లలో ఆశలు రేకెత్తించేలా జగన్‌ సర్కార్‌ నేడు రేపు అంటూ ఊరిస్తోంది.
చిత్తూరు పూనేపల్లి వద్ద నిర్మించిన టిడ్కో 300గజాల ఇండ్ల వందశాతం పూర్తిచేసి రెండు నెలల వ్యవధిలో లబ్దిదార్లకు అందిస్తామని అధికార యంత్రాగం ప్రకటించింది. క్షేత్రస్థాయితో అధికార ప్రకటనకు భిన్నంగా నక్కకు నాగలోకానికి ఉన్నత దూరం ఉందంటున్నారు లబ్దిదార్లు. అపార్టుమెంట్‌ పూర్తిచేసి సున్నాలు కొట్టి గృహాల్లోకి వెళ్లండి అంటే సరిపోతుందా... మౌలిక వసతులైన తాగునీరు, డ్రైనేజి, రోడ్లు, వీధిదీపాలు, పాఠశాల, కంమ్యూనిటి హెల్త్‌సెంటర్‌ వంటి వసతి సౌకర్యాలు కల్పించాలిని కోరుతున్నారు. లక్షల రూపాయలు చెల్లించాం.. అయినా అరకొర వసతులతో అప్పగిస్తే ఎలా అన్ని ప్రశ్నిస్తున్నారు. టిడ్కో ఇండ్లు పూర్తి చేశామంటూ హడాహుడి మాని మౌలిక వసతులు పూర్తి చేసిన తరువాత లబ్దిదార్లకు అప్పగించాలని కోరుతున్నారు.
చిత్తూరు నగరంలో ఇండ్లు లేని మధ్యతరగతి ప్రజలకి టిడ్కో ఇండ్ల పేరుతో పూనేపల్లి వద్ద 50ఎకరాల ప్రభుత్వ స్థలంలో స్కూల్‌, పార్కు, కమ్యూనిటి హెల్త్‌సెంటర్‌కు స్థలం కేటాయించి 59బ్లాక్‌లు దాదాపు 2వేల మందికి టిడ్కో ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మూడు కేటగిరీలు 300, 360, 400గజాల్లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. నాలుగు పోర్లలో నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. దాదాపు 85శాతం పోర్లు డ్రైనేజి, రోడ్లు, నీటివసతి మినహా పూర్తి చేశారు. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు ప్రస్తుత ప్రభుత్వం దాస్‌ కన్‌స్ట్రషన్స్‌ను 32 బ్లాక్‌లు, నాగార్జున కనస్ట్రషన్స్‌కు 27 బ్లాక్‌లు కాంట్రాక్టు ఇచ్చింది. ఎంఎస్‌ఆర్‌ ద్వారకా కన్‌స్ట్రషన్స్‌కు రోడ్లు, డ్రైనేజీ, పార్కు, పాఠశాల నిర్మాణ కాంట్రాక్టును అప్పగించింది.
టిడ్కో ఇండ్ల పేరుతో ఇంటిస్థలం లేని వారికి మూడు రకాల ఇండ్లు అంటే 300, 360, 460 గజాల పేరుతో ప్రభుత్వం ప్రభుత్వం లక్ష రూపాయల నుంచి 4లక్షల వరకు నగర పాలక సంస్థ రిజిస్ట్రేషన్ల పేరుతో పేద, మధ్య తరగతి నుంచి గత ప్రభుత్వంలో ఐదేళ్ల క్రింత డిపాజిట్ల రూపంలో తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే పూనేపల్లి వద్ద 3వేల గృహాలు నిర్మాణాలను 90శాతానికి పైగా పూర్తిచేసి లబ్దిదార్లకు అందించేలా మూడేళ్ల క్రితం లాటరీ పద్ధతి ద్వారా లబ్దిదార్లను ఏంపిక చేసి గృహప్రవేశాలుకు సిద్ధం చేస్తున్న తరుణంలో అసెంబ్లి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో గృహప్రవేశాలు ఆగిపోయాయి. నాటి నుండీ టిడ్కో ఇండ్ల లబ్దిదారులు ప్లాట్లైనా ఇవ్వండి లేదా డబ్బులైనా తిరిగీ చెల్లించాలంటూ ఆందోళనలు చేపట్టారు. ఎట్టకేలకు జగన్‌ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇండ్లను పూర్తిచేసే పనిలో పడింది. గృహప్రవేశాల పేరుతో ఎలాంటి మౌలికవసతులు కల్పించకుండా హడాహుడిగా లబ్దిదార్లకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు, లబ్దిదార్లు వాపోతున్నారు.
మౌలిక వసతుల కల్పించి.. లబ్దిదార్లకు అప్పగించాలి..
పూనేపల్లి వద్ద నిర్మించిన టిడ్కో ఇండ్ల మౌలిక వసతులైన తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిదీపాలు, పార్కు, పాఠశాల, కమ్యూనిటి హెల్త్‌సెంటర్‌ పూర్తి చేసిన తరువాతనే అప్పగించాలని సిపిఎం బృందం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, నగరకార్యదర్శి సురేంద్రన్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు బాలసుబ్రమణ్యం పూనేపల్లివద్ద నిర్మిస్తున్న టిడ్కో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరించడానికి లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టడం ఏమిటని గంగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఇన్ని సంవత్సరాలు ఇవ్వకపోవడం దారుణంగా ఉందన్నారు. గతంలో ఇచ్చిన కాంట్రాక్టర్‌ని తప్పించి మరో కాంట్రాక్టర్లకు ఇచ్చిరని ఏం చేస్తున్నారో పర్యవేక్షణ చేసే దిక్కే లేదన్నారు. ఇప్పటికైనా పూణేపల్లి వద్ద నిర్మించిన అన్ని రకాల ఇళ్ళు ను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.