అనంతపురం కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే సాధ్యమవుతుందని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం టిడిపి అనంతపురం పార్లమెంట్ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో రామ్‌నగర్‌లోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో మైనార్టీల సదస్సు నిర్వహించారు. టిడిపి మైనార్టీ సెల్ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు సాలార్‌బాషా, రాష్ట్ర నాయకులు, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ గౌస్‌మొద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు శాసన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, అత్తార్ చాంద్‌బాషా, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ మౌలానా, ఏపీ నూర్‌బాషా సంఘం అధ్యక్షులు సుభహాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ, ఉపాధి, సామాజికంగా అభివృద్ధి చెందారంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనలో జరిగిందన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి పరిపాలనలో పేరుకే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి అంజాద్‌బాషాకు ఇచ్చారని, నిధులు, విధులు చేపట్టలేని నిస్సహాయ స్థితిలో పని చేస్తున్నారని విమర్శించారు. పైగా రాష్ట్రంలో మైనార్టీలపై హత్యకాండ సాగుతోందన్నారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతోందన్నారు. మత విద్వేషాలు చేస్తున్న బిజెపితో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి లాలూచి పడి, తనపై ఉన్న కేసులకు భయపడి కేంద్రం తీసుకొచ్చిన అనేక బిల్లులకు మద్దతుగా నిలిచాడన్నారు. టిడిపి లౌకికతత్వం కలిగిన పార్టీ అన్నారు. విధాన పరంగా బిజెపిని వ్యతిరేకిస్తామన్నారు. మైనార్టీలు మేలుకోకపోతే భవిష్యత్ ఉండదన్నారు. రాష్ట్రం బాగుపడాలన్న, మైనార్టీలు అభివృద్ధి కావాలన్న టిడిపి అధికారంలోకి రావాలని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలు వేధింపులకు గురువుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితి పోవాలంటే టిడిపిని అధికారంలోకి తేవాలన్నారు. నూర్‌బాషా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ మాట్లాడుతూ టిడిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీని కౌరవ సభ నుంచి గౌరవ సభగా మార్చుతానని శపథం చేశారని, ఆ శపథం నెరవేర్చడానికి కృషి చేద్దామన్నారు. మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ మౌలానా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు జగన్‌కు ఒక అవకాశం కోరితే 151 సీట్లు గెలిపించి అధికారం ఇచ్చారని, కానీ మైనార్టీల నమ్మకాన్ని వమ్ము చేశాడన్నారు. మైనార్టీలపై దాడులు జరుగుతుంటే స్పందించిన పాపాన జగన్ పోలేదన్నారు. టిడిపి నాయకులు నాగుల్‌మీరా మాట్లాడుతూ మైనార్టీలకు రాష్ట్రంలో రక్షణ కరువైందన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ మైనార్టీల నమ్మకాన్ని చూరగొన్న పరిపాలన దక్షకులు ఎన్టీఆర్ ఆతరువాత చంద్రబాబు నాయుడు ఒక్కరే అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, టిడిపి మహిళా విభాగం నాయకులు పర్వీన్, చమన్ భార్య రమీజా చమన్, కుమారుడు డాక్టర్ ఉమర్ ముక్తార్, టిడిపి నాయకులు తాజుద్దీన్, శివబాల తదితరులు పాల్గొన్నారు.










