Oct 22,2023 21:11

పలాస : కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న శిరీష

ప్రజాశక్తి- పలాస: నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేకపోయినా రాష్ట్రమంత్రి సీదిరి అప్పలరాజు తన నివాసం ముందు మూడంతస్తులతో ప్రగతి భవనం పూర్తి చేసుకున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఎద్దేవా చేశారు. పలాస టిడిపి కార్యాలయంలో ఆదివారం పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ పరిధిలో ఉన్న నాలుగో వార్డు నుంచి సుమారు 60 మంది వైసిపి నుంచి టిడిపిలో చేరారు. వారికి గౌత శిరీష టిడిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పలరాజు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒక పర్యాయం పూర్తికాకముందే నెమలకొండ, సూది కొండ, నల్లబుడ్లూరు ఇలా నియోజకవర్గం పరిధిలో ఉన్న కొండలను మాయం చేశారని ఆరోపించారు. మూడేళ్లు కావస్తున్న నేటికీ కెటి రోడ్డు విస్తరణపనులు పూర్తి చేయలేకపోయారన్నారు. రైల్వే వంతెన పనులను పూర్తి చేస్తామని చెప్పి రెండోసారి శంకుస్థాపన చేశారని, రైల్వే వంతెన పనులు పూర్తి చేయలేకపోయారని అన్నారు. అట్టహాసంగా రైతుబజార్‌ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేసి గాలికొదిలేసారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి గౌతు శివాజీ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు, గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బూర్జ : మండలంలోని అల్లెనకు చెందిన వైసిపి మండలం మహిళా అధ్యక్షులు భారతీ తన అనుచరులతో ఆదివారం టిడిపిలోకి చేశారు. తుడ్డలి అంపిలి గణపతిరావు ఆధ్వర్యాన శ్రీకాకుళంలోని టిడిపి జిల్లా అధ్యక్షులు కూర రవికుమార్‌ సమక్షంలో చేరారు. వీరికి టిడిపి జెండా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో వైకుంఠరావు, టి.సాయిబాబు ఉన్నారు.