ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజాన్ని నింపాయి. 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి వరుసగా పరాజయాలనే చవిచూస్తూ వచ్చిన టిడిపి ఈ ఎన్నికలు ఒక ఔషధంగా పనిచేయనున్నాయి. గతంలో ఎన్నడూలేనంతగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఓటమిని చవిచూసింది. హేమాహేమీలనుకున్న వారుకూడా ఓటమి చెందారు. ఎప్పుడూ టిడిపికి కంచుకోటగా ఉండే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంత ఘోర ఓటమిని గతంలో ఎన్నడూ చవిచూడలేదు. 14 అసెంబ్లీ స్థానాలుంటే 12 వాటిల్లో ఓటమి చెందింది. ఉరవకొండ, హిందూపురం అసెంబ్లీ స్థానాలు మినహా తక్కిన అన్ని చోట్లా ఓడిపోయింది. ఓటమే ఎరుగని కుటుంబంగానున్న జెసి కుటుంబం కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. అటు తరువాత జరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలు అన్నింటిలోనూ ఘోరంగా ఓడిపోయింది. జిల్లాలో తాడిపత్రి మున్సిపాలిటీ మినహా తక్కిన అన్ని మున్సిపాలిటీల్లోనూ వైసిపినే గెలుచుకుంది. జిల్లా పరిషత్‌లో ఒకే ఒక్క సభ్యుడి మాత్రమే అడుగు పెట్టగలిగాడు. ఇంత తక్కువ సంఖ్య జిల్లా పరిషత్‌లో ఉన్నది ఇదే ప్రథమం. ఇంతటి ఘోర ఓటములతో ఆ పార్టీ క్యాడర్‌లోనూ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కొనగలదన్న సందేహాలు లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు విజయం సాధిస్తారన్న అనుమానాలు ఆ పార్టీ దిగువ స్థాయి నేతల్లోనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన మండలి ఎన్నికల్లోనూ ప్రారంభంలో అంతటి ఉత్సాహం కనిపించలేదు. వైసిపిని తట్టుకుని ముందుకు పోవడం సాధ్యమా అన్న సందేహాలను ఆ పార్టీ ముఖ్య నాయకుల్లోనూ కనిపించింది. అయితే బరిలో నిలిచి కొంత వరకైనా సత్తా చాటితే చాలన్నట్టుగా ప్రారంభమైంది. అయితే ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత వస్తున్న ఓట్లు చూసి ఆ పార్టీ నాయకుల్లో నూతనోత్సహం మొదలైంది. కౌంటింగు ముందుకు సాగుతున్న కొద్దీ, విజయవకాశాలు మెరుగుపడుతున్న కొద్దీ నాయకులు మరింత ఉత్సహంగా కౌంటింగు కేంద్రం వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. చాలా కాలం తరువాత ఎన్నికల ద్వారా వస్తున్న ఫలితాలు చూసి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇదే ట్రెండు కొనసాగే సూచనలున్నాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర జిల్లాలో ప్రారంభమవడంతో ఈ ఉత్సహం మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. ఇది ఇలాగుంటే వైసిపిలో ఇప్పటి వరకు ఎదురులేదన్నట్టుగా ఉంటూ వచ్చిన నాయకుల్లో ఫలితాలు అంతర్మథనం మొదలైంది. ఎన్నికల కౌంటింగులో అధికారులు టిడిపి అనుకూలంగా వ్యవహరించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇవి చేస్తున్నప్పటికీ లోలోన మాత్రం ఎక్కడో తేడా వస్తోందన్న సందేహాలు, గుబులు మాత్రం నేతల్లో మొదలైంది. వాస్తవానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ప్రచార సమయంలోనే వైసిపి ముఖ్య నాయకులకు ఈ అంశం బోధపడింది. అయితే తమకున్న అధికార బలంతో ఏదో రకంగా గట్టెక్కవచ్చునని భావించారు. అందుకు అనుగుణంగా ధన బలాన్ని కూడా ఉపయోగించారు. ఇతర అభ్యర్థులెవరూ డబ్బులు పంపిణీ కూడా చేయకపోవడంతో ఇక తమ విజయం సులువు అవుతుందని భావించారు. పట్టభద్రులకు ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున పంపిణీ చేశారు. ఈ డబ్బు ప్రభావంతో విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. కానీ ఫలితాలు చూశాక వారికీ అసలు వాస్తవం బోధపడుతోంది. డబ్బు ప్రబావం ఎన్నికల్లో ఏ మాత్రం పనిచేయలేదని, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ప్రజల్లో ఉందన్నది స్పష్టమవుతోంది. అయితే సంక్షేమ పథకాలు ఇంత పెద్దఎత్తున అమలు చేస్తున్నా, ప్రజల్లో ఎందుకు అసంతృప్తి ఉందన్నది మాత్రం గ్రహించలేకపోతున్నారు. ఈ ఫలితాలు ఏ రకంగా అర్థం చేసుకోవాలో పాలుపోని పరిస్థితుల్లో వైసిపి నేతలున్నారు.










