
* రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
ప్రజాశక్తి - పలాస: తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ కలిసి పోతుందని ఎప్పుడో తాను చెప్పానని, నేడు అది రుజువవుతోందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ 15వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం నిర్వహించారు. వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని రుజువైందన్నారు. త్వరలో టిడిపిలో జనసేన విలీనమైనా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు. జనసేన రాజకీయ పార్టీయే కాదని, టిడిపి అనుబంధ విభాగమన్నారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీ ఎలా వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వంటి ఆర్థిక ఉగ్రవాది దేశానికే ప్రమాదమని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల నమ్మకాన్ని బలి చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టుపై ఐటి ఉద్యోగులు చేస్తున్న ధర్నా అర్ధరహితమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మీసాల సురేష్‌బాబు, బోర కృష్ణారావు, పలాస ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ భవానీ శంకర్, బెల్లాల శ్రీనివాసరావు, విప్ దుర్గాశంకర్ పండా, మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్ర కుమార్, మున్సిపల్ డిఇ బి.హరి ఎఇఇ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.