
* విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచి సంక్షోభాలు కొత్తకాదని, ప్రతి సారీ ప్రజలే పార్టీకి రక్షణ కవచంగా నిలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు. నగరంలోని అరసవల్లిలో ఉన్న కళ్యాణ మండపంలో టిడిపి విస్తృస్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన పాలనలో కూల్చివేతలు, దాడులు, నెత్తుటి మరకలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పోలీసులతో పాటు ఇతర వ్యవస్థలను చేతుల్లో ఉంచుకుని ప్రజలను అనేక రకాలుగా వేధిస్తున్నారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని పక్కన పెట్టారని, మరోవైపు అనేక రకాలైన పన్నుల పేరుతో ప్రజలను పీడించుకుని రూ.వేల కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తున్న కారణం చేత టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబును 50 రోజుల పాటు జైల్‌లో పెట్టి ప్రాణాలకు ముప్పు వాటిల్లే రీతిలో మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనకు ఎటువంటి నష్టం జరిగినా ప్రజాక్షేత్రంలో జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టిడిపి శ్రేణులు మరింత విస్తృ స్థాయిలో ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు ఎంపిపిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.