Oct 29,2023 18:15

కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు బాబుతో నేను కార్యక్రమాన్ని కందుకూరు మండలం పందలపాడు గ్రామంలో ఆదివారం నిర్వహించారు. కందుకూరు నియోజకవర్గ ఇంచార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావు , పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ దివి శివరాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. చివరిగా స్థానిక చర్చి వద్ద జరిగిన ప్రజావేదికలో నాగేశ్వరరావు మాట్లాడుతూ అనేక రకాల హామీలతో జనాల చేత ఓట్లు వేయించుకుని ఎన్నికలయ్యాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత జగన్మోహన్‌ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్‌ ను నిర్వీర్యం చేసి పేదలకు ఎలాంటి రుణాలు అందకుండా చేశారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎంతో మందికి వాహనాలు, రుణాలు అందించడంతోపాటు డప్పు కళాకారులకు పింఛన్లు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ఎదగకూడదన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని, కేవలం డబ్బులు బ్యాంకు ఎకౌంట్లో జమ చేసినంత మాత్రాన వారి జీవితాలు మారబోవన్న సత్యాన్ని గ్రహించాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, యువతను మత్తు పదార్థాలకు బానిసలు చేశారని, రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని నాగేశ్వరరావు విమర్శించారు. ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించి జగన్మోహన్‌ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.దివి శివరాం మాట్లాడుతూ ప్రజలను కన్నబిడ్డల్లాగా చంద్రబాబు చూసినట్లుగా మరెవరూ చూడరన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ, వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంలోనూ చంద్రబాబు నాయుడు ముందంజలో ఉంటారని తెలిపారు. గత ప్రభుత్వంలో లోకేష్‌ మంత్రిగా ఉన్నప్పుడు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎస్సీ కాలనీలో సిమెంట్‌ రోడ్లు అత్యధికంగా ఏర్పాటు చేశారని శివరాం గుర్తు చేశారు. ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, కందుకూరులోనూ పార్టీ గెలుపుకు మద్దతు తెలపాలని ఆయన కోరారు.