Mar 18,2023 22:55

విజేత..భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి

       అనంతపురం ప్రతినిధి: మూడు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓటర్లు టిడిపికి పట్టంగట్టారు. ఓట్ల లెక్కింపు ఫలితాలు శనివారం రాత్రికి పూర్తయ్యాయి. ఈ ఎన్నికలో 7543 ఓట్ల మెజార్టీతో టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వైసిపి అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఆధ్యంతం హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగింది. ప్రారంభం నుంచి టిడిపి, వైసిపిల మధ్య నువ్వా...నేనా అన్నట్టుగానే ఓట్ల లెక్కింపు జరిగింది. ద్వితీయ ఓట్ల బదలాయింపులో పిడిఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజు ఓట్లలో 9886 ఓట్లు టిడిపికి లభించడంతో విజయం సులభమైంది.
ఆధ్యంతం పోటాపోటీ...
నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,45,687 ఓట్లు పోలవగా 11 రౌండ్లలో జరిగిన తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 19,239 ఓట్లు అనర్హమైనవి తొలగించారు. మిగిలిన 2,26,448 ఓట్లను లెక్కించారు. 49 మంది అభ్యర్థులు పోటీపడిన ఈ ఎన్నికల్లో ముగ్గురి మధ్యనే ప్రధానంగా ఓట్ల పంపిణీ జరిగింది. ఇందులో ప్రధానంగా వైసిపి, టిడిపిలకే పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. ప్రథమ ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యే సమయానికి వైసిపి అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి 95,659 రాగా, టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి 94,149 ఓట్లు వచ్చాయి. దీంతో వైసిపికి 1820 ఓట్ల మెజార్టీ లభించింది. ఇదే మెజార్టీ ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ కొనసాగింది. అధిక ఓట్లు సాధించిన వారిలో నాలుగో వ్యక్తిగానున్న నగరూరు రాఘవేంద్ర ఎలిమినేషన్‌ సమయంలో టిడిపి అభ్యర్థికి వైసిపికి మించి స్వల్ప మెజార్టీ వచ్చింది. పిడిఎఫ్‌ అభ్యర్థి నాగరాజు ఎలిమినేషన్‌ సమయంలో జరిగిన ద్వితీయ ఓట్ల లెక్కింపుతో టిడిపికి పూర్తి స్థాయి విజయానికి చేరింది.
రీకౌంటింగ్‌కు వైసిపి పట్టు...
ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత రీకౌంటింగ్‌ చేయాలని వైసిపి అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి పటుబట్టారు. అలా చేయడానికి వీల్లేదని ఎన్నికల అధికారి ఎస్‌.నాగలక్ష్మి చెప్పడంతో చేయాల్సిందేనంటూ కౌంటింగ్‌ కేంద్రం ఆవరణంలో బైటాయించి నిరసన తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే వైసిపి నాయకులు కౌంటింగ్‌లో ఏదోక వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. గురువారం రాత్రే కొంత మంది యువకులను తీసుకొచ్చి ఎటువంటి కారణం లేకుండానే ఘర్షణకు దిగారు. దీంతో వారిని పోలీసులు బయటకు తీసుకెళ్లారు. ఆ తరువాత శుక్రవారం రాత్రి కూడా వైసిపి అభ్యర్థి టిడిపి నాయకులు కౌంటింగ్‌ కేంద్రంలోకి వచ్చారంటూ వివాదానికి దిగారు. కౌంటింగ్‌ తరువాత తిరిగి రికౌంటింగ్‌ చేయాలని పట్టుబట్టారు. అయితే ఎన్నికల అధికారిగానున్న అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఇందుకు అంగీకరించలేదు. టిడిపి అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డి గెలిచినట్లు ప్రకటించారు.
చెల్లని ఓట్లు ఎనిమిది శాతం
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో మొత్తం 3.30 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో 74 శాతం అంటే 2,45,687 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 19,239 ఓట్లు చెల్లని ఓట్లుగా కౌంటింగ్‌లో తొలగించారు. పోలైన ఓట్లలో సుమారు ఎనిమిది శాతం ఓట్లు చెల్లని ఓట్లుగా ఉన్నాయి. వీటిల్లో చూసినప్పుడు పట్టభద్రులు ఓటింగ్‌ సరైన పద్ధతిలో చేయకపోవడంతోనే చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. ఇందులో జరిగిన తప్పిదాలు చూస్తే ఒకే ప్రాధాన్యతలు ఇద్దరికివ్వడం, మరికొంత మంది అభ్యర్థుల ఎదుట సంఖ్యలు కాకుండా టిక్కులు పెట్టడం, మరికొంత మంది బ్యాలెట్‌ పేపరును మడిచి దానిపై తాము వేయాలనుకున్న అభ్యర్థులకు సంబంధించిన అంకెలను వేసియున్నారు. ఇటువంటి కారణాలతో వేసిన ఓట్లు చెల్లకుండా పోయాయి.
పోలీసు భారీ భద్రత
ఓట్ల లెక్కింపు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతుండటంతోపాటు, రెండు పర్యాయాలు వివాదాలు చెలరేగడంతో పోలీసు భద్రతను కౌంటింగ్‌ కేంద్రం వద్ద భారీగా ఏర్పాటు చేశారు. చిన్న ఘటన జరిగిన వెంటనే వారిని బయటకు పంపించే విధంగా పోలీసు భద్రతను కట్టుదిట్టడం చేయడంతో కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగింది.