Oct 26,2023 21:52

ఎమ్మెల్యే అశోక్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

* ఎమ్మెల్యే అశోక్‌ అరెస్టు
* గౌతు శిరీష గృహ నిర్బంధం
ప్రజాశక్తి - కవిటి, పలాస: 
సామాజిక సాధికార యాత్రను వ్యతిరేకిస్తూ ఇచ్ఛాపురం టిడిపి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కవిటి బస్టాండ్‌ కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు టిడిపి శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఐ రాము నేతృత్వాన పోలీసులు ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేసి కవిటి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. పలాసలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషతో పాటు పలువురు నాయకులు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సోంపేటకు కారులో బయలుదేరుతున్న శిరీషను పోలీసులు అడ్డుకున్నారు. యాత్ర నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతారన్న ఉద్దేశంతో హౌస్‌ అరెస్టు చేశారు.
ప్రజలకు ఏం చేశారని సామాజిక సాధికార యాత్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ప్రశ్నించారు. అరెస్టుకు ముందు కవిటి మండలం రామయ్యపుట్టుగలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిత్లీ తుపాను బాధితులకు అదనపు పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో యాత్ర ప్రారంభిస్తున్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ చేసిన నేరాలకు జైలు శిక్ష అనుభవించాడు కాబట్టి ప్రతిపక్ష నేతలపైనా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేశామని యాత్రలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రెండు రోజులుగా ఇచ్ఛాపురం మెయిన్‌ రోడ్డును దిగ్బంధించి స్థానికులు, ప్రయాణికులకు ఇబ్బందులు పెట్టి రోడ్డుకు అడ్డంగా సభ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.