Jun 11,2023 20:25

ప్రజాశక్తి - ఆచంట
ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆచంట రైతు సంఘం కార్యాలయంలో టిడిపి మండల విస్తృత స్థాయి సమావేశం పార్టీ మండల అధ్యక్షులు కేతా మీరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పితాని పాల్గొని మాట్లాడారు. మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో నమూనాలో ఒక భాగం మాత్రమే అన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయఘంటా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకూ విద్యుత్‌ ఛార్జీలను వివిధ రూపాల్లో పెంచి వినియోగదారుల నెత్తిమీద అధిక భారం మోపి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కరెంట్‌ బిల్లుల పెంపుపై వైసిపి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని విమర్శించారు. ఈ దోపిడీ చేసే విధానాన్ని అడ్డుకుని ప్రజలపై మోపుతున్న భారాన్ని తగ్గించేందుకు త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గొడవర్తి శ్రీరాములు, సర్పంచి గుబ్బల మాధవరావు, ఎంపిటిసి తమ్మినీడి పృథ్వి కుమార్‌, నాయకులు బీరా నరసింహమూర్తి, తమ్మినీడి ప్రసాద్‌, చిలుకూరి శ్రీనివాస్‌, కేతా మురళి, నాగార్జున పాల్గొన్నారు.