Apr 14,2023 22:15

అంబేద్కర్‌కు నివాళి అర్పిస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి, ఉషశ్రీ

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం      తాము తెలుగుదేశం పార్టీ నాయకుల్లా కల్లబొల్లి కబుర్లు చెప్పడం లేదు, చేసింది మాత్రమే చెబుతున్నామని ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడులో రూ.13 కోట్లతో నూతనంగా నిర్మించిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే పద్మావతి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పుడో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఈ పాఠశాలకు 5 ఎకరాల భూమి కేటాయించారన్నారు. తెలుగుదేశం పాలనలో కేవలం రూ.2 కోట్లు ఖర్చు పెట్టి దానిని అనాథలా వదిలేశారని అన్నారు. 450 మంది విద్యార్థినులను ఇక్కడ కాకుండా వేరే చోటుకి మార్చి, నానా అవస్థల పాలు చేశారన్నారు. వారి దీనావస్థ చూసి వెంటనే గురుకుల పాఠశాలను అక్కడ నుంచి వేరే చోటుకి మార్పించానని అన్నారు. జగనన్న దగ్గరకు వెళ్లి పరిస్థితి వివరించగా రూ.5 కోట్లు మంజూరు చేశారన్నారు. రూ.13 కోట్లతో గురుకుల పాఠశాలను పూర్తి చేయడం, అదీ మహానుభావుడు అంబేద్కర్‌ జయంతి రోజున ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందని అన్నారు.అనంతరం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌, అనంతపురం పార్లమెంట్‌ సభ్యులు తలారి రంగయ్య, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అనుబంధ సంఘ నాయకులు, వైసిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.