Oct 26,2022 21:29

తగ్గుతున్న చెరకు సాగు
అప్పుల భారం భరించలేమంటున్న రైతన్నలు
తెల్లబెల్లం తయారు చేయాలంటున్న అధికారులు
ప్రజాశక్తి- వెదురుకుప్పం:

మండలంలో రోజురోజుకు చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. రైతులు చెరకు సాగుకు ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ కూలీల రేట్లు పెరగడం, చెరకుకు గిట్టుబాటు ధర లేకపోవడం, నల్లబెల్లం తయారీపై ప్రభుత్వ ఆంక్షలతో రైతులు చెరకును పండించడానికి ముందుకు రావడం లేదు. కొందరు రైతులైతే పంటను అలాగే వదిలేసి పట్టణాలకు వలసలు పోతున్నారు.
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలో వెదురుకుప్పంలో 25 పంచాయతీలున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ ప్రధాన వాణిజ్య పంటైన చెరకు సాగుకు ప్రాధాన్యత ఇస్తారు రైతులు. సంవత్సరంపాటు పండించిన చెరకును గానుగ ద్వారా బెల్లం తయారు చేస్తుంటారు. ఈ మండలంలో ఇది ఒక కుటీర పరిశ్రమగా ఉంది. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం 2021-22 సంవత్సరంలో ఈ మండలలో 591 ఎకరాల్లో చెరకు సాగు చేయగా 2022-23 సంతవ్సరంలో 533 ఎకరాల్లో మాత్రమే చెరకు సాగు అవుతోంది. చెరకుకు ధర లేకపోవడంతో వ్యవసాయంపై రైతన్నలకు శ్రద్ధ తగ్గి విస్తీర్ణం తగ్గుతోంది.
అంతంతమాత్రంగా మార్కెట్‌ ధర..!
నాటుసారా తయారీకి అధికంగా నల్లబెల్లం ఉపయోగిస్తుండటంతో సారా నియంత్రణకు నల్లబెల్లంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో రైతుల వద్ద వ్యాపారులు కొనుగోలు చేయాలన్నా, రైతులు అమ్మాలన్నా కొన్ని నిబంధలను పెట్టింది. దీంతో ఎక్కువ మంది వ్యాపారులు బెల్లం కొనడానికి ముందుకు రాలేదు. దీనికి తోడు మార్కెట్‌లో బెల్లం ధర రోజురోజుకి పతనమవుతుండటంతో రైతు ఏమి చేయాలో దిక్కుతోచని స్ధితిలో ఉండిపోయారు. మార్కెట్‌లో బెల్లం ధర ప్రస్తుతం ఒక బండి (750కేజీలు) రూ.16వేలు అంటే కిలో బెల్లం రూ.21.33లు.
కూలీల రేట్లు భారమే..
బెల్లం తయారు చేయడానికి గానుగ ఆడించడానికి కూలీల అవసరముంటుంది. వీరిలో మగవారికి రోజుకి రూ.600లు, ఆడవారికి రూ.300లు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కాకుండా భోజనం వగైరా ఖర్చులు ఉంటాయి. మొత్తం రైతు సాగు చేసినందకు అయ్యే ఖర్చులు సగం కూడా దక్కకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
చెరకు పండిస్తే నష్టమే వస్తోంది..
- గుర్రమ్మ, మహిళా రైతు, మాంబేడు.
ప్రస్తుతం ఉన్న కూలిరేట్లు, ఖర్చులతో చెరకు పండించడం కష్టంగా ఉంది. అప్పులు చేసి పండించినా దానికి తగిన లాభం ఉండటం లేదు. దీనికి తోడు పొలంలో పనులు చేయడానికి కూడా కూలీలు ఎవరూ రావడం లేదు. దీంతో పంట కోయడం ఆలస్యమై కూడా నష్టపోతున్నాం. ఇక నష్టాలను భరించలేక పంట భూములను బీడుగా వదిలేస్తున్నాం..
ఉపాధి హామీ చట్టానికి అనుసంధానం చేయాలి
- దేశయ్య, రైతు, వెదురుకుప్పం
ప్రస్తుతం పొలాల్లో పనులు చేయడానికి ఎక్కువగా కూలీలు రావడం లేదు. సరైన సమయంలో కూలీలు దొర్కనానా ఇబ్బందులు పడుతున్నాము. ఉపాధి హామీ చట్టాన్ని రైతులకు అనుసంధానం చేయాలి. దీని వలన కూలీల కొరత కొంత వరకు తగ్గుతుంది. రైతులు కాస్త లాభపడతారు. ప్రభుత్వం దీనిపై ఆలోచించాల్సి ఉంది.