కనకాయలంక ప్రజల అవస్థలు
ప్రజాశక్తి - యలమంచిలి
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి భారీగా వరద నీటిని విడుదల చేస్తుండడంతో ఆదివారం కూడా గోదావరి వరద కొనసాగింది. దీంతో లోతట్టు ప్రాంతమైన కనకాయలంక గ్రామంలో కాజ్‌వేపై మరింత నీటిమట్టం పెరగడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువులు, తాగునీరు తెచ్చుకోవాలన్నా, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు వైద్యం కోసం వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లాలన్నా వ్యయ ప్రయాసలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నాలుగు రోజులుగా పని దొరకని పరిస్థితుల నేపథ్యంలో పూట గడవడం కూడా కష్టంగా మారిందని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే మరింత తీవ్ర పరిస్థితి వస్తుందని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.










