తగ్గేదేలేదు..!
పోరాటం ఉధృతం
ఐదో రోజుకు మున్సిపల్ కార్మికుల సమ్మె
చెవిలో పువ్వు,వంటావార్పుతో నిరసనలు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విషయంలో తగ్గేదేలేదని మున్సిపల్ వర్కర్లు చెబుతున్నారు. రోజురోజుకూ వీరి పోరాటం పెరుగుతూనే ఉంది. రోజుకో కొత్త నిరసన కార్యక్రమంతో వారు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. వారేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా వేతనాన్ని పెంచాలని మూడేళ్లుగా కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం కనీస స్పందన కూడా లేకుండా పోయింది. ఇక విధిలేని పరిస్థితుల్లో సమ్మె బాట పట్టారు. నేటితో ఐదో రోజుకు చేరుకుంటోంది. ప్రజలు కూడా వీరికి మద్ధతుగా నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వారికి అనుకూలంగా స్పందిస్తున్నారు.
అనారోగ్యాల భారిన కార్మికులు
చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు నగరి, కుప్పం, పుంగనూరు, పలమనేరు వంటి మున్సిపాలిటీల్లో 822మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 158 మంది శాశ్వత ప్రాతిపదికన, మిగిలిన వారందరూ అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో 1.20లక్షల గృహలున్నాయి. ఆయా ప్రాంతాల్లో వీరు లేనిదే ఏ పనీ జరిగే పరిస్థితి లేదు. వీధులతో పాటు, మన ఇళ్ళన్నీ శుభ్రంగా ఉండాలంటే వీరు పని చేస్తేనే సాధ్యమవుతుంది. నిత్యం దుమ్ము, దూళి, మలినాలు, విష కాలుష్యంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. మురుగు మొత్తాన్నీ తొలగిస్తున్న వీరికి ఎంత సాయం చేసినా తక్కువే అవుతుంది. అలాంటి వారిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కనీస వేతనం అడుగుతుంటే నాన్చుతూ ఇబ్బందులకు గురి చేస్తోంది.
మాట మార్చుతున్న ప్రభుత్వం
మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.6వేలు అదనంగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టింది.. కనుక ఇచ్చేది లేదని ఒకసారి, జనవరి నుంచి రూ.3వేలు జీతం పెరిగింది కనుక హెల్త్ అలవెన్సు ఆపేస్తున్నామని మరోసారి మాటలు మార్చుతూ కార్మికులను ప్రభుత్వం గందగోళం చేస్తోంది. కానీ మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.21వేలు వేతనం ఇస్తామని ప్రకటించారు. ఇందులో జీతం రూ.15వేలు, హెల్త్‌అలవెన్సు రూ.ఆరువేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుత మంత్రి ఆదిమూలపు సురేష్ రూ.18వేలే అని చెబుతూ వీరి కడుపు మంట పెట్టుకుంటున్నారు. కాగా అశితోష్ మిశ్రా సిఫారసుల ప్రకారం రూ.20వేల వేతనంతో పాటు కరువు భత్యం ఇవ్వాలని చెప్పింది. ఈ ప్రకారం అయితే ఒక్కో కార్మికుడికి రూ.20వేలు నుంచి రూ.24వేలు రావాల్సి ఉంది. 11వ వేతన సరవరణ కమిటీ సిపార్సులను అమలు చేయకపోవడం వల్ల ఒక్కోక్కరూ ఏడు నుంచి రూ.9వేలు నష్టపోతున్నారు.
నిర్లక్ష్యం తగదు..
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదు. సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కార్మికులందరికీ కనీస వేతనాలు ఇవ్వాలి.
- వాడ గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి
చిత్తూరుఅర్బన్: గత నాలుగు రోజులుగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నా జగన్‌మోహ్మన్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గంగా ఉందని ఎఐటియుసి నాయకులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పట్టించుకోరా అంటూ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ విభాగం కార్మికులు చెవిలో పూలు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపిన అనంతరం కార్మికులు ప్రదర్శనగా బయలుదేరి చర్చివీధి, మార్కెట్లో చౌకు, స్వామిరెడ్డి వీధి, బజార్ వీధి, శేషాపురం ఫిరాన్ వీధి, హై రోడ్డు మీదుగా చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు.
కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిసిసి అధ్యక్షులు డాక్టర్ సురేష్‌బాబు అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గత నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతున్న మున్సిపల్ కార్మికులకు ఆయన మద్దతు పలికారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గోవిందరాజులు, పార్థిబన్, నరసింహులు, భరత్ గుణశేఖర్, మంజమ్మ, హేమావతి, వెంకటేష్ , కార్మికులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
పలమనేరు: తమ సమస్యలను పరిష్కరించాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాలుగో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా పలమనేరు పురపాలక సంఘం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రోడ్డుపై వంటా వార్పు చేపట్టి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికులు చేసే సమ్మెకు రైతుల సంఘం జిల్లా నాయకులు ఓబుల్ రాజు మద్దతు తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గిరిధర్ గుప్తా, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సురేంద్రనాథ్, డివిజన్ సెక్రటరీ చెన్నకేశవులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా సమయంలో కార్మికులు చేసిన త్యాగాలు గుర్తుకు రావటం లేదా అని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజా, జయంతి, పి.శ్రీనివాసన్, మురళి, సూరి, బాలాజీ, జయమ్మ, గంగులమ్మ, ప్రమీలమ్మ పాల్గొన్నారు.










