
ప్రజాశక్తి - పలాస: తగాదా తీర్చేందుకు వెళ్లిన వృద్ధుని తలపై చెంబుతో దాడి చేయడంతో మృతి చెందిన ఘటన పలాసలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో మండలంలోని సూదికొండకు చెందిన సయ్యద్ ఖాదర్ (65) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం హిరమండలానికి చెందిన సయ్యద్ ఖాదర్ పలాస మండలంలోని సూదికొండకు చెందిన షేక్‌దాస్‌తో కలిసి టైల్స్ పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిందట సయ్యద్ ఖాదర్, షేక్‌దాస్ మద్యం సేవించారు. ఆ సందర్భంలో షేక్‌దాస్‌కు సయ్యద్ ఖాదర్ రూ.50 బకాయి పడి ఉన్నాడు. తన బాకీ డబ్బులు ఇవ్వాలని మంగళవారం రాత్రి సయ్యద్ ఖాదర్‌ను షేక్‌దాస్ అడగడంతో గొడవ ప్రారంభమైంది.
వారిద్దరూ కొట్టుకుంటున్న సమయంలో సూదికొండకు చెందిన వృద్ధుడు సయ్యద్ ఖాదర్ విడదీసేందుకు వెళ్లాడు. చెంబుతో బలంగా వృద్ధుని తలపై కొట్టడంతో ఆయన మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాశీబుగ్గ ఎస్‌ఐ ఖాదర్ కేసు నమోదు చేశారు.