Sep 20,2022 21:39

తెప్పోత్సవంలో వరసిద్ధుని విహారం
ప్రజాశక్తి- ఐరాల:
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన మంగళవారం స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈసందర్భంగా పగలు స్వామివారి మూలవిరాట్‌కు వివిధ రకాల సుగంధ పరిమళద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పంచామతం పంచిపెట్టారు. సాయంత్రం రకరకాల పరిమళపుష్పాలతో రంగురంగుల విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించిన తెప్పోత్సవంపై స్వామివారి ఉత్సవమూర్తులను స్వామివారి పవిత్ర పుష్కరిణిలో ప్రదక్షణ చేయించారు. తెప్పల పైకి పరిమితమైన సంఖ్యలో ఉభయదారులు అర్చకులను అనుమతించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ తెప్పోత్సవానికి కాకర్లవారిపల్లెకి చెందిన గాలి పుండరీకనాయుడు, ఆర్‌.శేషాద్రి నాయుడు అండ్‌ బ్రదర్స్‌, సి.దామోదర్‌ నాయుడు, అడపగుండ్లపల్లికి చెందిన జి.హనుమంత నాయుడు, చిన్నకాంపల్లికి చెందిన జి.దామోదర్‌ నాయుడు, ఉత్తర బ్రాహ్మణపల్లికి చెందిన జి.రామచంద్ర నాయుడు, బొమ్మసముద్రానికి చెందిన లంకిపల్లె మోహన్‌బాబులు ఉభయదారులకు వ్యవహరించారు. అలాగే ఆలయ ఈఓ ఎంవి.సురేష్‌ బాబు, ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మెన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈఈ వెంకట నారాయణ, ఎసి కస్తూరి, ఎఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఎస్వీ కష్ణారెడ్డి, హేమమాలిని, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, శ్రీనివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు, ఆలయ ప్రధాన ఇన్‌ఛార్జి అర్చకులు ధర్మేశ్వర గురుకుల్‌, రాఘవేంద్రస్వామి, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.