ప్రజాశక్తి - తణుకురూరల్
హమాలీ కార్మికుల పట్ల చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎపి సీడ్స్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, టెండర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం స్థానిక తహశీల్ధార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్ధార్ పిఎన్‌డి.ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఎపి సీడ్స్‌లో అక్రమ టెండర్ విధానం రద్దు చేయాలని, కార్మికులపై రాజకీయ కక్షలు ఆపాలని కోరుతూ నినదించారు. టిడిపి నేత గండి రామకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్, ఐలు జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి, పౌరహక్కుల సంఘం నాయకులు కౌరు వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు పి.దక్షిణామూర్తి, అడ్డగర్ల అజయకుమారి, సీడ్స్ యూనియన్ కార్యదర్శి గాది త్రిమూర్తులు మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను ఎందుకు తొలగిస్తున్నారని విమర్శించారు. సీడ్స్‌లో జరుగుతున్న అన్యాయాలను హమాలీలు ప్రశ్నిస్తూ అడ్డుతగులుతున్నారనే ఎక్కడా లేని టెండర్ విధానాన్ని తీసుకొచ్చారన్నారు. కార్మికులకు చట్టప్రకారం కనీసం నోటీసు కూడా ఇవ్వకపోవడం అధికారుల అవగాహనా లేమికి నిదర్శనమన్నారు. ధర్నా అనంతరం పైడిపర్రు ప్రాంతంలో కార్మికుల పట్ల అధికార వైసిపి, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రచురించిన కరపత్రాలు ఇంటింటా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గార రంగారావు, శ్రీహరి, సాంబశివరావు, వరలక్ష్మీ, రూతమ్మ, రమణ, శ్రీదేవి పాల్గొన్నారు.
పెంటపాడు:కార్మికులకు నష్టదాయకమైన కొత్త టెండర్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబూరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ కొత్త టెండర్ విధానం వల్ల రైస్‌మిల్లులో పనిచేసే కార్మికులు సివిల్ సప్లై గోడౌన్స్‌లో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతారన్నారు. ముఖ్యంగా రైతులు బాగా నష్టపోతారన్నారు. ఒకపక్క వ్యవసాయ రంగానికి గిట్టుబాటు ధర లేక పండించిన పంట అమ్ముకోలేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రైస్‌మిల్లులో, సివిల్ సప్లై గోడౌన్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు అంతంతమాత్రంగా ఉన్న పనులను టెండర్ విధానం వల్ల మొత్తం పనులు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. ఈ టెండర్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిని ధాన్యం సేకరణ మిల్లింగ్ తదితర పనులను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంకురు నాగేశ్వరరావు, పెనగంటి దుర్గ, కె.రమేష్, అల్లు రామకృష్ణ, అన్నవరం, వట్లూరు శ్రీను, రాము, జగన్నాథం, వెంకట్రాజు, చిన్న సత్యనారాయణ, రాంబాబు పాల్గొన్నారు.










