Jun 27,2023 22:26

బస్సుయాత్రలో ఉన్నం, మాదినేనికి మద్దతుగా నినాదాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు

       కుందుర్పి : కళ్యాణదుర్గం టిడిపిలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు మద్దతుదారులు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు పాల్పడ్డారు. కుందుర్పి మండల పరిధిలోని శీగలపల్లి గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీ బస్సుయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతుండగానే ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నం, ఉమామహేశ్వర నాయుడుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇది కాస్త శృతిమించి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు బస్సుయాత్ర సాగిన అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో నాయకులు యాత్రను నామమాత్రంగా నిర్వహించి ముగించేశారు.
చంద్రన్న పాలనతోనే రాష్ట్రాభివృద్ధి
బస్సుయాత్రలో భాగంగా టిడిపి నాయకులు వైసిపి పాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావాలని కోరారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా ఉందన్నారు. 2024లో సైకో పాలన వెళ్లి, సైకిల్‌ పాలన వచ్చేలా టిడిపి శ్రేణులు పని చేయాలని సూచించారు.