పట్టించుకోని రెవెన్యూ
ప్రజాశక్తి-శ్రీకాళహస్త్తిి:
పట్టణ శివారు ప్రాంతమైన టైలర్స్ కాలనీలో ఆక్రమణలు జోరందుకుంటున్నాయి. ఇక్కడి భూమికి మంచి గిరాకీ ఉండటంతో అక్రమార్కుల కన్ను ఖాళీ స్థలాలపై పడింది. దీంతో తమ అర్థబలాన్ని, అంగబలాన్ని ప్రదర్శిస్తూ ఖాళీ జాగాలపై పాగా వేసేస్తున్నారు. వీరికి అధికారపార్టీ అండదండలతో పాటు కొందరు రెవెన్యూ అధికారుల సహకారాలుండటంతో ఆక్రమణలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. వివరాల్లోకి పోతే..1997-98 ప్రాంతంలో ఆర్సీపపీ సమీపంలోని సర్వేనెం. 386, 400, 410, 439, 440 లలో అప్పటి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి ప్రాంత టైలర్ల సంక్షేమం కోసం, వారి సొంతింటి కలను నెరవేర్చడం కోసం 375 మంది టైలర్లకు 2 సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించారు. ఆ స్థలాలకు టైలర్స్ కాలనీగా నామ కరణం చేశారు. అయితే కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో నిర్మాణాలు సాగలేదు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఈ స్థలాలపై అక్రమార్కుల కన్నుపడింది. అదును చూసి స్థలాలను కబ్జా చేయడం మొదలుపెట్టారు. దీంతో మన స్థలాలు కూడా కబ్జాకు గురవుతాయని తెలిసి కొందరు టైలర్లు ముందుకొచ్చి ఇళ్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ఆర్థిక స్థోమత లేని కొందరు టైలర్లు తమ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టకపోవడంతో అవి ఎక్కడ కబ్జాకు గురవుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీను కాలనీపై నిరంతరం పర్యవేక్షణ ఉండటంతో ఆక్రమణలకు ఆస్కారం లేకుండా ఉండేదని టైలర్లు చెబుతున్నారు. అయితే పట్టణానికి కూతవేటు దూరంలోని టైలర్స్ కాలనీలో ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
ఖాళీ స్థలాలపై నిఘా పెట్టాలి
టైలర్ల సంక్షేమం కోసం ఇచ్చిన స్థలాలను కొందరు అక్రమంగా ఆక్రమించుకోవడం బాధాకరం. కాలనీలోని ఖాళీ స్థలాలపై రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాలనీలో మౌలిక వసతులు లేక కొందరు, ఆర్థిక స్థోమత లేక మరికొందరు టైలర్లు నిర్మాణాలు చేపట్టలేదు. ప్రనభుత్వం సహకారమందిస్తే సొంతింటి కలను నెరవేర్చుకుంటారు.
- శ్రీను, టైలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు










