తాత్కాలిక కార్పొరేషన్ కార్యాలయంలో...
సిబ్బంది కూర్చోడానికీ కుర్చీల్లేవు
బీరువాలు పెట్టుకోడానికి స్థల కొరత
వాహనాల పార్కింగ్‌కూ ఇబ్బందే
ప్రజాశక్తి - తిరుపతి టౌన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తాత్కాలిక కార్యాలయం సరైన వసతులు లేక అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. పాత మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేసి ఐకానిక్ భవనం నిర్మాణానికి 71 కోట్ల రూపాయలతో రెండు నెలల క్రితం భూమి పూజ జరిగింది. కార్పొరేషన్ పాలన సాగించడానికి స్విమ్స్ ఆసుపత్రి సమీపంలోని పాత మెటర్నటి ఆసుపత్రి వద్ద తాత్కాలిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయంలో సుమారు 500 మంది పని చేస్తారు. ఇందులో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, పారిశుద్ధ విభాగంతో పాటు సాధారణ పరిపాలన సిబ్బంది ఉంటారు. దాదాపు కోటి రూపాయలతో తాత్కాలిక కార్యాలయంలో పనులు చేపట్టారు. కోటి రూపాయలు ఖర్చు చేసినా అక్కడ వసతులు తక్కువ ఉండడం తో సిబ్బంది ఇబ్బందులు వర్ణనాతీతం. గత 20 సంవత్సరాలు సంబంధించిన ఫైల్సు ఉండడంతో వాటిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక తికమక పడుతున్నారు. బీరువాలు కూడా సుమారు 70 పైగా ఉన్నాయి. వాటిని పెట్టడానికి స్థలం లేక వేరు వేరు ప్రాంతాల్లో ఉంచాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సంబంధించిన ఫైలే ఎక్కువ ఉంటాయి. ఇంజనీరింగ్ విభాగంలో డీఈలు, ఏఈ లు ఎక్కువ మంది ఉంటారు. ఏఈలకు కూర్చోవడానికి చాంబర్లు లేవు. అలాగే రెవెన్యూ విభాగంలో ఆర్ ఐ లు, బిల్ కలెక్టర్లకు కూర్చోవడానికి చాంబర్ లేదు. దీనికి తోడు కార్పొరేషన్ వార్డ్ అడ్మిన్లు కూడా ఉండడంతో ఇరుకైన ప్రాంతంలో కూర్చోవాల్సి వస్తుంది. మొదటి అంతస్తు లో పరిపాలన చేస్తుండగా రెండవ అంతస్తులో మేయరు, డిప్యూటీ మేయర్లు, కమిషనర్ ఛాంబర్లు ఉన్నాయి. తాత్కాలిక కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల సంబంధించిన వాహనాలు పెట్టుకోవడం కూడా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు.
గడువులోపు పూర్తవుతుందా..?
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన ఐకానిక్ భవనం 19 నెలల్లో పూర్తి చేస్తామని కమిషనర్ చెబుతున్నారు. ఇది పూర్తిగా స్మార్ట్ సిటీ నిధులతో చేసే పనులు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకంలో నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను సకాలంలో ఇవ్వకపోవడంతో చాలా పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ కొత్త భవనం 19 నెలల్లో పూర్తవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సకాలంలో ఇస్తేనే పనులు త్వరగా అవుతాయని కాంట్రాక్టర్ అంటున్నారు. ఆలస్యంగా నిధులు ఇస్తే రెండు నుంచి మూడు సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా స్మార్ట్ సిటీ పథకంలో పనులు త్వరగా పూర్తికావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను సకాలంలో ఇవ్వాల్సి ఉంది.










