ప్రజాశక్తి - వాల్మీకిపురం (చిత్తూరు) : తాళాలు లేకపోవడంతో ఉదయం 11:30 గంటలయినా వాల్మీకిపురం పట్టణంలోని మూడు సచివాలయాలు తెరుచుకోలేదు. దీంతో సచివాలయ ఉద్యోగులు గడప వద్దే కూర్చుండి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులుపడ్డారు. సచివాలయంలో పనిచేసే వాచ్ మెన్ తాళాలు తీసుకుని వెళ్లి, ఫోన్ చేసినా తీయడం లేదని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. పలు సేవల కోసం సచివాలయం వద్దకు వచ్చిన ప్రజలు చేసేదేమీ లేక వెనుతిరగాల్సి వచ్చింది. సచివాలయం తెరుచుకున్నప్పుడు కూడా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 1 బి, అడంగల్ తదితర వాటి కోసం వెళుతున్న తమతో సచివాలయ ఉద్యోగులు నెట్ రావడం లేదంటూ చెబుతున్నారని అన్నారు. సచివాలయ ఉద్యోగుల పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.










