తాఖీదులతో తంటా..!
-వెంటాడుతున్న పోలీసులు
-వ్యక్తిగత కార్యక్రమాల్లో ఉన్నా నోటీసులు పంపిణీ
-ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
సిపిఎస్ ఉద్యోగులకు తాఖీదుల తంటా వెంటాడుతోంది. వారు వ్యక్తిగత కార్యక్రమాల్లో ఉన్నా వారిని పోలీసులు వెంబడిస్తున్నారు. సెలవు రోజులైనా, పొలం పనుల్లో ఉన్నా ఎక్కడున్నా వారు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. మిట్టమధ్యాహ్నం, అర్థరాత్రి అనీ తేడా లేకుండా ఇళ్లకు పోలీసులు వెళ్లి నోటీసులు ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. చుట్టుపక్కల వారు ఏమనుకుంటారని వారు భయపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సిపిఎస్ రద్దు కోసం సెప్టెంబర్ ఒకటో తేదీ విజయవాడలో మిలీనియం మార్చ్ నిర్వహించాలని సిపిఎస్ ఉద్యోగులు తలపెట్టారు. అదే రోజు సిఎం ఇంటిని ముట్టడించేందుకు కూడా వారు ప్రణాళిక రూపొందించారు. వీటిల్లో పాల్గొనకూడదని పేర్కొంటూ పోలీసులు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తున్నారు. శని,ఆదివారాలు సెలవులున్నప్పటికీ విడవకుండా వారు తాఖీదులు ఇస్తున్నారు. దీనిపై ఆయా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఆదివారం రోజు పూతలపట్టు మండలం ఆగనంబట్టు గ్రామంలో యుటిఎఫ్ నాయకులు రెడెప్పనాయుడుకు ఆయన పొలంలో పనులు చేసుకుంటూ ఉంటే అక్కడకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. అలాగే ఎస్‌టియు నాయకులు గంటామోహన్‌కు 25వ తేదీ రాత్రి 9.15గంటలకు ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. దాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు గోడపైన నోటీసును అంటించారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడకు వెళ్లి నోటీసులు ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అణచేయాలని చూస్తే
ఉద్యమం ఎక్కువ అవుతుంది
ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలపై అణచివేత విధానాలు ఆపాలని యుటిఎఫ్ డిమాండు చేస్తోంది. సిపిఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ ఒకటో తేదీ ఉద్యోగులు తలపెట్టిన కార్యక్రమానికి మేము సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నాం. వేళాపాళా చూడకుండా నోటీసులు జారీ చేయడం దారుణం. వెంటనే ఇలాంటి కార్యక్రమాలను ఆపాలి. హక్కుల కో సం నిరసన తెలిపే హక్కు ఉద్యోగసంఘాలకు రాజ్యాంగం కల్పించింది. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ విధంగా ఇలాంటి ఆంక్షలు విధించలేదు.
- రమణ, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి










