Jun 14,2022 22:24

తాగునీటికి ఇబ్బంది ఉండకూడదు : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
జిల్లా వ్యాప్తంగా ఉన్న మంచినీటి ట్యాంకులను గుర్తించి ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసేలా చూడాలని అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ పంచాయతీలలో పన్నుల వసూలుకు సంబంధించి, 35 మేజర్‌ గ్రామ పంచాయతీలలో అభివద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని, అన్ని ఎస్‌డబ్ల్యూపిసిలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని వాటి ద్వారా సంపదను వద్ధి చేయాలని సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్‌ పంచాయతీ అధికారి, డిఆర్‌పిసిల తోపాటు ఈఓపిఆర్‌డిలతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలం వస్తోందని ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అందుకోసం గ్రామీణ ప్రాంతాలలో గల రక్షిత మంచినీటి పథకాలను గుర్తించి శుభ్రం చేయించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసే ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా అక్కడ వాటర్‌ లీకేజ్‌, పైప్‌లైన్‌ వంటి సమస్యలు ఉంటే ఈవోపీఆర్డీలు గుర్తించి పరిష్కరించాలన్నారు. జిల్లాలో 697గ్రామాలు ఉండగా 587 బందావనాలు ఉన్నాయని 110గ్రామాలకు బందావనాలు లేకపోవడంతో 48 మంజూరు చేయడం జరిగిందని నిర్మాణాలు వేగవంతంగా జరిగేటట్లు చూడాలన్నారు. అదేవిధంగా ఉన్న బందావనాలు అని అందుబాటులోకి తీసుకువచ్చి గ్రామాలలో చెత్తసేకరణ సక్రమంగా చేసి వ్యర్థాల నుంచి ఎరువుల తయారీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో 5వేల జనాభాకుపై ఉన్న 35 మేజర్‌ పంచాయతీలను గుర్తించామని, ఈ మేజర్‌ పంచాయతీలో ఉన్న ప్రధాన సమస్యలను ఒక ప్రణాళిక రూపంలో తయారు చేయాలని ప్రాధాన్యత ప్రకారం ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, పన్ను వసూళ్లకు ప్రాధాన్యత ఉండేలా చూడాలన్నారు.