ప్రజాశక్తి-రాయదుర్గం పట్టణంలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచి నీటి ఎద్దడిని నివారించాలని మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈమేరకు పట్టణంలో పట్టణంలో మెరుగైన తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతవారం, పదిరోజులుగా పట్టణ ప్రజలు తీవ్రమైన తాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొళాయిల ద్వారా అరకొరగా సరఫరా అవుతున్న నీరు సైతం రంగు మారి దుర్వాసన వెదజల్లుతోందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నట్లు వాపోయారు. వెంటనే తాగునీటి సరఫరాలో ఉన్న లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఇందుకు కమిషనర్ స్పందిస్తూ గతంలో పంపింగ్ పైప్‌లైన్ పగిలిపోవడం, మరమ్మతుల కారణంగా నీటి సరఫరాలో జాప్యం జరిగిందన్నారు. ఇకపై రెండు రోజులకోసారి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం పురపాలక సంఘం మాజీ అధ్యక్షుడు ముదిగల్లు జ్యోతి, వార్డు సభ్యులు ప్రశాంతి, జ్యోతి, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం, టిడిపి పట్టణ అధ్యక్షులు నాగరాజు, రాయదుర్గం మండల కన్వీనర్ హనుమంతు, పురపాలక సంఘం మాజీ ఉపాధ్యక్షులు మహబూబ్‌బాషా, వెంకటేశులు, మాజీ వాళ్లు సభ్యులు భారతి, వెంకటేశులు, నాయకులు తిప్పయ్య, సన్నన్న, అంజి, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు, నాయకులు










