Aug 12,2023 22:12

తాగునీటి సమస్య పరిష్కరించాలని జాతీయ రహదారి దిగ్బంధం

      ప్రజాశక్తి-ఉరవకొండ   పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వివిధ కాలనీలకు చెందిన మహిళలు శనివారం స్థానిక అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ 20 రోజులకు ఒకసారి కూడా నీటిని సరఫరా చేయలేకపోతున్నారన్నారు. అనేక రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నామని అధికారులు, నాయకులకు తెలియజేసినా పట్టించుకున్న పాపానపోలేదన్నారు. తాగునీరు లేకపోతే ఎలా జీవించాలని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించే వరకూ ఆందోళన విరమించమని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఉరవకొండ ఎస్‌ఐ వెంకటస్వామి సిబ్బందితో చేరుకుని మహిళలతో చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే మరోసారి జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.