May 16,2023 21:38

విలేకరులతో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌

          ప్రజాశక్తి-కళ్యాణదుర్గం   నియోజకర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ విమర్శించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకర్గంలోని 104 గ్రామాలతోపాటు ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాలకు తాగునీరు అందించే సత్యసాయి ప్రాజెక్టు మోటార్లు చెడిపోయి దాదాపు 20 రోజులు కావస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడన్నారు. దీంతో ఆయా గ్రామాల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉషశ్రీచరణ్‌ మంత్రిగా కొనసాగుతున్నా ప్రజలకు ఈ దుస్థితి ఏంటని నిలదీశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాల్సి నాయకులు కొంతమంది సత్యసాయి కార్మికులు సమ్మె చేస్తుండటంతో తాగునీటి సమస్య నెలకొందని చెప్పడం సిగ్గుచేటన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు తాగునీటి ఎద్దడిని నివారించాలని, లేనిపక్షంలో తమతో కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి సిపిఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.