ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్‌డబ్ల్యూఎస్ శ్రీసత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలేదీక్షలను శనివారం విరమించారు. దీక్ష చేస్తున్న వారికి స్ట్రగుల్ కమిటీ నాయకులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ నిమ్మరసం ఇచ్చి సమ్మె విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయి వేతనాలు, ఇఎస్‌ఐ, పిఎఫ్, గ్రాట్యూటీ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ కార్మికులు 19 రోజుల పాటు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు నిర్వహించారని తెలిపారు. గతంలో కూడా అనేక మార్లు నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేపట్టిన ప్రభుత్వం స్పందించలేదన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి సిఐటియు, ఐఎఫ్‌టియు, వైఎస్‌ఆర్‌టియు ట్రేడ్ యూనియన్ నాయకులు కలిసి విన్నవించామన్నారు. నేటికీ పరిష్కారం కాలేదన్నారు. వీధిలేని పరిస్థితిలో ఆగస్టు 25 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు స్ట్రగుల్ కమిటీ నాయకులు తెలిపారు. ఆగస్టు 20 నుంచి 24వ తేదీ వరకూ పని చేసే చోట నిరసనలు చేయాలని స్ట్రగుల్ కమిటీ తీర్మాణించినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు రాకూడదనే నిరసనలతో ప్రభుత్వానికి విన్నవించామన్నారు. అయినా స్పందన లేదన్నారు. ప్రజలు కూడా కార్మికులకు మద్ధతుగా నిలవాలని కోరారు. వీరి దీక్షలకు అనంత హక్కుల పోరాట సంఘం నాయకులు సోమర రాహుల్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి కార్మికుల యూనియన్ తిప్పేస్వామి, చిన్న బాబయ్య, రవీంద్ర ఆచారి, ప్రసాద్, ఇమామ్, ఐఎఫ్‌టీయు కార్మికుడు నీలకంఠ, భగవాన్ సత్యసాయి యూనియన్ వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గోవిందులు పాల్గొన్నారు.
దీక్షలను విరమింపజేస్తున్న స్ట్రగుల్ కమిటీ నాయకులు ఎస్.నాగేంద్రకుమార్










