తాగునీరందించండి మహప్రభో..!
చిన్నపుల్లేరు గ్రామస్తుల ఆవేదన
ప్రజాశక్తి - ఉండి
తమకు శుద్ధి చేసిన జలాలను అందించాలని చినపుల్లేరు గ్రామస్తులు వేడుకుంటున్నారు. గ్రామంలో సుమారు 1200 మంది ప్రజలు నివాసం ఉంటున్నారని, వారికి శుద్ధి చేసిన తాగునీటిని అందించడంలో పంచాయతీ పాలకవర్గం విఫలమైందని పలువురు విమర్శిస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులకు శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చిన పాలకవర్గం రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చకుండా తుంగలో తొక్కారన్నారు. పబ్లిక్ కుళాయిల ద్వారా గ్రామ పంచాయతీ అందించే మంచినీరు మురికిగా వస్తున్నాయని, వాటిని తాగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఆక్వా చెరువుల వ్యర్థజలాలను ఉండి ప్రధాన పంట కాలువలో వదిలేస్తున్నారని, ఆ నీటిని మంచినీటి చెరువులోకి నింపుతుండగా గ్రామపంచాయతీ ఆ నీటిని శుద్ధి చేయకుండా యధాతధంగా పబ్లిక్ కుళాయిల ద్వారా విడుదల చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ నీటిని తాగడం ద్వారా వైరల్ వ్యాధుల బారిన పడుతున్నామని, ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి పబ్లిక్ కుళాయి కనెక్షన్లు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అది మాటల వరకే పరిమితమైందని, కార్యరూపం దాల్చలేదని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి తానింకి శ్రీనివాసరావును వివరణ కోరగా చినపుల్లేరు గ్రామానికి జలజీవన్ మిషన్ పథకంలో రూ.52 లక్షల నిధులు మంజూరయ్యాయని, కాంట్రాక్టర్ త్వరలోనే పని ప్రారంభించి ప్రతి ఒక్కరికి పబ్లిక్ కుళాయి కనెక్షన్ ఇచ్చి శుద్ధి చేసిన మంచినీటిని ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాగునీరు అందించడంలో విఫలం
కోణాల ఏసేబు, చినపుల్లేరు
గ్రామంలో కొంతకాలంగా తాగునీటిని అందించడంలో పంచాయతీ పాలకవర్గం పూర్తిగా విఫలమైంది. ప్రస్తుతం వేసవికాలం ప్రారంభం కావడంతో కాలువలు కట్టేసే సమయం ఆసన్నమవ్వడంతో అధికారులు గ్రామాల్లోని మంచినీటి చెరువును పూర్తిస్థాయిలో నింపుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ చినపుల్లేరులోని మంచినీటి చెరువును పూర్తిస్థాయిలో నింపలేదు.
అనారోగ్య బారిన పడుతున్నాం
గోడి చినబాబు, చినపుల్లేరు
గ్రామపంచాయతీ వారు పబ్లిక్ కుళాయిల ద్వారా పంపిణీ చేసే నీటిని తాగడం ద్వారా అనారోగ్య బారిన పడుతున్నాం. కేవలం 1200 మంది జనాభా మాత్రమే ఉన్న చినపుల్లేరు గ్రామానికి మంచినీరు అందించడంలో అధికారులు, పాలకవర్గం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి చుట్టుపక్క గ్రామాలైన పెదపుల్లేరు, సీసలి, జక్కరం తదితర గ్రామాల నుంచి మంచినీరు కొనుక్కుని తెచ్చుకోవాల్సిన దుస్థితి గ్రామంలో నెలకొంది.










