Apr 25,2023 08:20

జెసి.ప్రభాకర్‌రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసి, గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు

         తాడిపత్రి : తాడిపత్రిలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. సోమవారం నాడు జెసి.ప్రభాకర్‌రెడ్డి పెద్దప్పూరు మండలంలోని పెన్నా ఇసుక రీచ్‌ సందర్శనకు బయళ్దేరారు. శాంతిభద్రతల దృష్ట్యా అక్కడికి వెళ్లేందుకు వీల్లేదంటూ అయన్ను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఇదే సమయంలో తాడిపత్రి మున్సిపల్‌ కమిషనర్‌ తీరును నిరసిస్తూ టిడిపి కౌన్సిలర్లు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు.
ప్రభాకర్‌రెడ్డి గృహ నిర్బంధం..
మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి.ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పెన్నానదిలో అక్రమ ఇసుక రవాణా తరలింపును ఆపాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నాడు ప్రభాకర్‌రెడ్డి పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఇసుక తరలింపు పరిశీలనకు వేళ్లేందుకు తన అనుచరులతో కలిసి ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చారు. తాడిపత్రి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన అక్కడికి వెళ్లేందుకు వీల్లేదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లో ఉన్న ప్రభాకర్‌రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి, మీడియాతో మాట్లాడేందుకు వీల్లేదంటూ పోలీసులు వారించారు. ఇందుకు ప్రభాకర్‌రెడ్డి ఒప్పులేదు. దీంతో డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ సమయంలో పోలీసులు, టిడిపి నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా, జెసి అనుచరులు తెలుగుదేశం కార్యకర్తలు ఇంటి వద్దకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ చైతన్య మాట్లాడుతూ చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదన్నారు. పెన్నానదిలో ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
టిడిపి కౌన్సిలర్ల వంటావార్పు...
తాడిపత్రి మున్సిపాల్టీలో కమిషనర్‌ అభివద్ధికి సహకరించలేదని ఆరోపిస్తూ ఆయన వైఖరికి నిరసనగా పురపాలక సంఘం కార్యాలయం ఎదురుగా వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా టిడిపి కౌన్సిలర్లు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అక్కడ నుంచి ఛైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డిని కలిసేందుకు ఆయన ఇంటి వద్దకు ర్యాలీగా బయళ్దేరారు. వీరిని పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్‌ రెడ్డి మున్సిపల్‌ కౌన్సిలర్లు చేపట్టిన వంటావార్పు కార్యక్రమంలో పాల్గొనేందుకు మున్సిపల్‌ కార్యాలయం వైపు వెళ్లడానికి ప్రయత్నం చేశారు. గృహ నిర్బంధంలో ఉన్నందున బయటకు వెళ్లేందుకు వీల్లేదంటూ జెసిపిఆర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
కమిషనర్‌పై శాఖ పరమైన చర్యలు తీసుకోండి
టిడిపి కౌన్సిలర్లు

తాడిపత్రి పురపాలక సంఘం అభివద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కౌన్సిల్‌ తీర్మానాన్ని పెడచెవిన పెడుతున్న కమిషనర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. పురపాలక సంఘానికి సంబంధించిన మార్కెట్‌ వేలంపాటలు జరపనందుకు జరిగిన నష్టానికి కమిషనర్‌ బాధ్యత వహించాలన్నారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలు, కాలువలు ఆక్రమించి రోడ్లు వేయడం, మున్సిపల్‌ కార్యాలయంలో మాయమైన 12 టైర్లు, విలువైన పరికరాలకు కమిషనర్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.