ప్రజాశక్తి తాడిపత్రి :ఎంతో సంతోషంగా దైవదర్శనానికి వెళ్లిన ఓ కుటుంబం మరో అరగంటలో ఇంటికి చేరుకుంటామనుకున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. తుఫాను వాహనాన్ని లారీ ఢకొీన్న ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల కుటుంబసభ్యులు ఆసుపత్రి ఆవరణంలో చేస్తున్న రోదనలు కంటతడిపెట్టించాయి.
కడప జిల్లా రైల్వే కొండాపురం సమీపంలోని తాడిపత్రి కడప జాతీయ రహదారిలో తాడిపత్రి శివార్లలోని చిత్రావతి నది సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందినవారు ఆరుగురు కాగా, మరొకరు వాహనం డ్రైవర్. ఈ ప్రమాదానికి సంబందించిన వివరాలు... తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురంలో నివాసముంటున్న వెంకటలక్ష్మి తన ముగ్గురు చెల్లెళ్ల కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం తాడిపత్రిలో తుఫాను వాహనాన్ని బాడుగ తీసుకుని డ్రైవర్‌తో కలసి మొత్తం 14 మంది తిరుమలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సోమవారం తెల్లవారుజామున తాడిపత్రి శివార్లలోని కడప జిల్లా రైల్వే కొండాపురం సమీపంలోని తాడిపత్రి కడప జాతీయ రహదారిలో చిత్రావతి నది సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢకొీంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన వెంకటలక్ష్మి (55), ఆమె కుమారుడు సునిల్‌కుమార్‌రెడ్డి (27), కర్నాటరాష్ట్రం కంప్లికి చెందిన లక్ష్మిదేవి (38), కంప్లికి చెందిన సుభద్ర (38) ఆమె కుమారుడు లిఖిత్‌కుమార్‌రెడ్డి(11), మైలవరానికి చెందిన సుమలత(38), వాహనం డ్రైవర్ అబకంపల్లెకు చెందిన సుధాకర్‌రెడ్డి (38) మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మేఘన, శిల్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో వెంకటలక్ష్మి, లక్ష్మిదేవి, సుభద్ర, సుమలత సొంత అక్కాచెల్లెళ్లు కాగా, సునిల్‌కుమార్‌రెడ్డి, నితిన్ వెంకటలక్ష్మి, సుభద్ర కుమారులు. ఈ ప్రమాదంలో గాయపడిన నారాయణరెడ్డి, జయలక్ష్మి, ఆదిలక్ష్మి, మోక్షిత్‌రెడ్డి, యువన్‌రెడ్డి, మేఘనారెడ్డి, శిల్పారెడ్డిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో ప్రభుత్వ వైద్యశాల వద్ద కుటుంబ సభ్యులు చేస్తున్న రోదనలు కంటతడి పెట్టించాయి.
అరగంటలో ఇంటికి చేరుతామనే లోపే ...
దైవ దర్శనానంతరం ఎంతో సంతోషంగా మరో అరగంటలోపు ఇంటికి చేరుకుంటామని అనుకునే లోపే వారు అనంతలోకాలకు వెళ్లారు. తాడిపత్రికి చెందిన వెంకటలక్ష్మి భర్త సంవత్సరం క్రితం మృతిచెందాడు. అప్పటినుంచి ఇంటి వద్దనే ఉన్న వెంకటలక్ష్మిని ఆలయాల దర్శనార్థం తీసుకువెళదామని కుటుంబసభ్యులు భావించారు. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మి తన చెల్లెళ్లు అయిన లక్ష్మిదేవి, సుభద్ర, సుమలతను తాడిపత్రికి పిలిపించుకున్నారు. వీరితో పాటు వెంకటలక్ష్మి కుమారుడు సునిల్‌కుమార్‌రెడ్డి, నితిన్‌తో పాటు వారి బంధువులైన మేఘన, శిల్ప, ఆదిలక్ష్మి, నరసింహారెడ్డి, కాటసాని భాస్కర్ రెడ్డి, తదితరులతో పాటు వాహన డ్రైవర్ సుధాకర్‌రెడ్డి మొత్తం 14 మంది తుఫాను వాహనంలో తిరుమలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ విషాదఘటన చోటు చేసుకుంది.










