తాడిపత్రి : వివాదాలు, సంచనాలకు కేంద్ర బిందువు అయిన అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరో సంఘటన చోటు చేసుకుంది. నిత్యం రాజకీయ ఘర్షణలు చెలరేగే ఈ ప్రాంతంలో ఓ పోలీసు సర్కిల్ ఉన్నతాధికారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈయన మృతిపై భిన్నవాదనలు విన్పిస్తున్నాయి. పని ఒత్తిడి అని కుటుంబ సభ్యులు చెబుతుండగా, రాజకీయ వేధింపులే కారణం అని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. పోలీసు మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకుని చిల్లర రాజకీయాలు చేయడం సరికాదంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు. మొత్తం మీద తాడిపత్రి సిఐ ఆనందరావు ఆత్మహత్య వ్యవహారం సోమవారం నాడు తాడిపత్రిలోనే కాకుండా జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పోలీసులు, కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా ఆనందరావు(51) విధులు నిర్వహిస్తున్నారు. 1998లో ఎస్‌ఐగా పోలీసు శాఖలో విధులు ప్రారంభించిన ఆయన తరువాత సిఐగా ఉద్యోగోన్నతి పొందారు. ఏడాదిగా తాడిపత్రి సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని నంద్యాల రోడ్డు వద్ద అద్దె ఇంట్లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆదివారం నాడు యథావిధిగా ఆయన విధులకు హాజరయ్యాడు. విధులు పూర్తయిన తరువాత రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. తనగదికి వెళ్లి నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో ఆయన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వేకువజామున 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఆనందరావు గదిలో చూడగా ఆయన ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే డీఎస్పీ గంగయ్య పట్టణ ఎస్‌ఐ ధరణి బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిఐ మృతి విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసులు ఆసుపత్రికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులతో ఆరా తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఆనందరావు సొంతూరైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కల్లోడుపల్లి గ్రామానికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
పెద్దఎత్తున చేరుకున్న పోలీసులు
అందరితో మంచిగా ఉండే సిఐ ఆనందరావు ఆత్మహత్య విషయం తెలియగానే పోలీసు సిబ్బంది నిర్ఘాంతపోయూరు. సమాచారం తెలిసిన వెంటనే పెద్దఎత్తున పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు త్రిలోక్, సుధాకర్‌రెడ్డి తదితరులు చేరుకుని నివాళులు అర్పించారు. పోస్టు మార్టం అనంతరం పోలీసు గౌరవ వందనం తెలియజేశారు.
రాజకీయ కారణమా... కుటుంబ కలహాలా..!
సిఐ ఆనందరావు మృతిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అధికారిక ఒత్తిళ్లు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, కుటుంబ కలహాలన్న మరో వాదన వినిపిస్తోంది. భార్యకు ఆయనకు మధ్య కొంతకాలంగా గొడవలున్నట్టు సమాచారం. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాదనలు జరిగినట్టు తెలుస్తోంది. పని ఒత్తిడి వల్లనే తన తండి ఆత్మహత్య చేసుకున్నాడని సిఐ కూతరు మొదట మీడియాకు చెప్పినప్పటికీ తరువాత వ్యక్తిగత కారణాలతోనని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వృత్తిపరమైన ఒత్తిళ్లు లేవు : ఎస్పీ
ఆనందరావు ఆత్మహత్య చేసుకున్న ఇంటిని ఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనందరావు గత సంవత్సర కాలంగా తాడిపత్రిలో సిఐగా తన విధులను పూర్తి స్థాయిలో నిర్వహించారన్నారు. ఆయనకు ఎలాంటి వత్తిపరమైన ఒత్తిళ్లు లేవన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెప్పారు.
ఒత్తిడి ఉందని చెప్పేవారు
సిఐ కుమార్తె భవ్య
ఇటీవల విధి నిర్వహణలో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని తరచూ నాన్న చెప్పేవారంటూ సిఐ ఆనందరావు కూతురు భవ్య సోమవారం ఉదయం ఆసుపత్రి వద్ద విలేకరులకు తెలిపారు. గతంలో కడప, తిరుపతి ప్రాంతాల్లో విధులు నిర్వహించిన సమయంలో ఇలా ఎప్పుడు ఒత్తిడికి గురైన సందర్భాలు లేవన్నారు. గత మూడు నెలలుగా తీవ్రంగా ఒత్తిడికి లోను అవుతున్నట్లు తమతో చెప్పేవారని ఆమె తెలియజేశారు.
రాజకీయ ఒత్తిల్లే కారణం
మున్సిపల్ ఛైర్మన్ జెసి.ప్రభాకర్‌రెడ్డి
తాడిపత్రి సిఐ ఆనందరావు ఆత్మహత్యకు రాజకీయ ఒత్తిళ్లే కారణం అని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జెసి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఆయన ఆనందరావు మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకనే సిఐ ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఓ కేసులో వైసీపీ నాయకుడిని చేర్చాల్సి ఉండగా ఆ నాయకుడిని కేసులో చేర్చరాదంటూ అధికార పార్టీ నాయకులు సిఐపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఇదే విషయమై ఓ ఉన్నతాధికారి ఆఫీసులో వైసీపీ నాయకుడు, పట్టణ సిఐ, ఎస్‌ఐ ఆదివారం నాడు చర్చలు జరిపింది వాస్తవం కాదా అన్న విషయాలను బహిర్గతం చేయాలన్నారు.
చిల్లర రాజకీయం చేయడం తగదు
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
సిఐ ఆత్మహత్యను కూడా రాజకీయం చేసి, చిల్లర రాజకీయాలు చేయడం తగదని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. సిఐ ఆత్మహత్యపై జెసి.ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. సిఐ ఆనందరావు మతి చాలా బాధాకరం అన్నారు. సిఐ మృతిపై జెసి.ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం జెసి బ్రదర్స్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. సిఐ మృతిపై అవసరం అయితే విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నమని ఎమ్మెల్యే తెలిపారు.










