Apr 12,2023 22:28

యువగళం పాదయాత్రలో మొక్కజొన్న రైతుతో మాట్లాడుతున్న నారా లోకేష్‌

         పెద్దపప్పూరు, యాడికి : యువగళం పాదయాత్ర, ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు మఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపనలు వచ్చాయని, భవిష్యత్తులో ఇదే కొనసాగుతుందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ తెలిపారు. లోకేష్‌ యువగళం పాదయాత్ర బుధవారం 68వ రోజు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో కొనసాగింది. పసలూరు నుంచి ప్రారంభం అయిన యాత్ర కొట్టాలపల్లి, కమ్మవారిపల్లి, నగరూరు, తుట్రాలపల్లి, టి.కొత్తపల్లి, రామరాజుపల్లి, రాయలచెరువు గ్రామాల మీదుగా కొనసాగింది. రాయలచెరువులో రాత్రికి బస చేశారు. కమ్మవారిపల్లి వద్ద నిరుద్యోగ యువతతో భేటి అయ్యారు. నగరూరు వద్ద రైతులతో సమావేశం అయ్యారు. తుట్రాలపల్లి ఎస్సీ కాలనీలో సీనియర్‌ సిటిజన్లు, పట్టు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రామరాజుపల్లిలో ఎన్టీఆర్‌ గహాల బాధిత లబ్ధిదారులతో మాట్లాడారు. సాయంత్రం రాయలచెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిడిపి నాయకులు, కార్యకర్తలను ఉద్ధేశించి లోకేష్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతోందన్నారు. ప్రజలపై భారాలు, వేధింపులు అధికం అయ్యాయన్నారు. రూ.10 ఖాతాలో వేసి రూ.100 దొడ్డిదారిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లాగేసుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఎన్నికల మందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తి చేయని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. అందుకే ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపికి తగిన బుద్ధి చెప్పారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు తాడేపల్లి కంపించిందన్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఉనికిని చాటుకునేందుకే జగనే మా నమ్మకం అంటూ ఎమ్మెల్యేలకు స్టిక్కర్లు, బ్యాగులు ఇచ్చి రోడ్లపైకి పంపారన్నారు. జగన్మోహన్‌రెడ్డిది రాజారెడ్డి రాజ్యంగం అయితే, టిడిపిది అంబేద్కర్‌ రాజ్యంగం అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు రద్దు అవుతాయనే ప్రచారాన్ని వైసిపి నేతలు వాలంటీర్ల ద్వారా చేయిస్తున్నారని, దీనిని ఎవరూ నమ్మొద్దన్నారు. సంక్షేమానికి పట్టినిల్లు టిడిపి అని, ప్రజలకు మరిన్ని పథకాలను అందించి వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చాక తాడిపత్రి ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందోని లోకేష్‌ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరుగుతోందని చెప్పారు. 40 ఏళ్లు ఉండాడిల్సిన ఇసుకను ఈ నాలుగేళ్లలో దోచేశారన్నారు. ఈ దోపిడీ పాలనకు ప్రజలు అంతం పలకాలన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే బిసిలకు రక్షణగా నిలుస్తామన్నారు. బిసి కార్పొరేష్లను పటిష్ట పరిచి, దామాషా పద్ధతిలో నిధులు కేటాయిస్తామన్నారు. స్థానిక సంస్థల్లోనూ ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. బిసిలతో పాటు, ముస్లిం, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలను ఆదుకునే చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగుల కోసం ప్రతి ఏడాదీ జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. పన్నుల భారాలను తగ్గించే చర్యలను తీసుకుంటామ్నరు. తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్‌ పరిశ్రమలకు ప్రోత్సాహాలను అందిస్తామన్నారు. వాటిపై పన్నుల భారాలను తగ్గించి మూతబడిన గ్రానైట్‌ పరిశ్రమలను తెరిపిస్తామన్నారు. తాడిపత్రి ప్రాంతంలో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసి కార్మికులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలకు అండదండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
సొంత మనుషులకే రక్షణ లేదు
జెసి.అస్మిత్‌రెడ్డి

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో ఆయన సొంత మనుషులకే రక్షణ లేదని, ఇక ప్రజల గురించి ఏమి ఆలోచిస్తారని తాడిపత్రి టిడిపి నియోజకవర్గం జెసి.అస్మిత్‌రెడ్డి తెలిపారు. యువగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇదే పాలన కొనసాగితే మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రాబోవు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకుని పోయిన గౌరవాన్ని రాష్ట్రానికి తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి అనంతపురం జిల్లా అధ్యక్షుడు బికె.పార్థసారధి, తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జెసి.అస్మిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, ధర్మవరం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌తో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.