Jun 19,2023 15:00

ప్రజాశక్తి-పెనుమూరు : గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని  మామిడి రైతు నాయకులు పులికల్లు పూర్ణచంద్రారెడ్డి కోరారు. సోమవారం ఆయన మావిడి  రైతులతో కలిసి పెనుమూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మే నెలలో మామిడి రైతులు జిల్లా కలెక్టర్ ను కలిసి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరడమైందన్నారు. తోతాపురి రకం మామిడి టన్ను రూ.25 వేలు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశామన్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి టన్ను రూ. 19 వేలుగా ధర ప్రకటించడం జరిగిందన్నారు. అయితే జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కుమ్మక్కై టన్ను రూ.11 వేలుకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. టన్ను రూ.20 వేలుగా ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలుంగుండ్లపల్లె బుచ్చిరెడ్డి, మురళి నాయుడు, హేమాద్రి నాయుడు  పాల్గొన్నారు.