Apr 17,2023 15:01
  • 43 సార్లు వినతులిచ్చిన కార్మికుల సంఖ్య పెంపు లేదు                   

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ కార్పొరేషన్ లో జనాభాకు తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంపు చేయాలని కోరుతూ 43 సార్లు స్పందనలో వినతులు ఇచ్చిన కార్యరూపం దాల్చలేదని సోమవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సావిత్రికి మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై పరిష్కారం చూపకపోవడం దారుణం అన్నారు. నగరంలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య 600 లోపలే ఉందన్నారు జనాభాకు తగ్గట్టు కార్మికుల సంఖ్య పెంచకపోవడం వలన అధిక పని భారంతో కార్మికుల సతమతమవుతున్నారన్నారు ఈ కార్మికుల సంఖ్యా పెంపుపై కౌన్సిల్ సమావేశాల్లోనూ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లోనూ ప్రజారోగ్య శాఖ అధికారులకు తెలియజేసిన చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. 2019లో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రతి మున్సిపాలిటీకి 70 మంది కార్మికులను అదనంగా తీసుకోవడం జరిగింది అన్నారు. ఆ సమయంలో కరోనాను లెక్కచేయకుండా కోవిడ్ కార్మికులు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోనూ పని చేశారన్నారు. అలాగే ఉన్నతాధికారులు ఎక్కడ పనులు అప్పగిస్తే కాలువల్లో స్ప్రే చేయడం పూడిక తీయడం వాహనాలకు లోడర్లు గా వెళ్లడం ఇంటింటి చెత్త సేకరణ చేయటం వంటి అనేక పనులు మలేరియా కార్మికులు చేస్తున్నారని అన్నారు. 20 సంవత్సరాల నుంచి ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్న గార్బేజి కార్మికులు  గృహ యజమానులు ఇచ్చే సొమ్ముతో జీవనం సాగించే వారన్నారు. అయితే ప్రభుత్వం క్లాప్ ఆటో విధానాన్ని ప్రవేశపెట్టడంతో వారు ఉపాధి కోల్పోయారు వారికి జీవనోపాధి కల్పించాలని కోరగా రెండు నెలలు పూడికతీయు పనులు కల్పించి వారికి ఉపాధి కల్పించారు. మున్సిపల్ కార్పొరేషన్ లో శాశ్వత ఉద్యోగులు188 మంది పదవి విరమణ చేశారన్నారు. ఖాళీ అయిన పోస్టులను ఇప్పటివరకు భర్తీ చేయలేదన్నారు. ఇప్పటికైనా కోవిడ్ మలేరియా గాడ్బేజ్ కార్మికులను ఔట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించాలని బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని వారి వేతనాల్లో ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టే విధంగా చర్యలు చేపట్టాలని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగి అధికారులకు విన్నవించిన స్పందన కరువైందన్నారు. కార్మికుల సమస్యలపై తక్షణం స్పందించకుంటే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందే ధర్నా నిర్వహించే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ మలేరియా గార్బేజి కార్మికులు పాల్గొన్నారు.