- జీవో నెంబర్ 1,42 లను పూర్తిస్థాయిలో అమలుపరచాలి
- ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయకార్యదర్శి సిద్దార్థ్
ప్రజాశక్తి-ఉరవకొండ : ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులు దోపిడీని అరికట్టాలని,జీవో నెంబర్ 1,42 లను పూర్తిస్థాయిలో అమలుపరిచి, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో పొందుపరచాలి ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయకార్యదర్శి సిద్దార్థ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవేట్ విద్యా సంస్థలు విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలకు వేలు ఫీజులను అక్రమంగా వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను దుకాణాల్లో సరుకుల్లాగా కేజీల ప్రకారం అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. అక్షరాలపై లక్షల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థలపైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ఆరోపించారు. విద్యా హక్కు చట్టాన్ని తుంగలోకి తొక్కి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ తదితర స్టడీ మెటీరియల్ ను ఆయా పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలని, బయట కొనుగోలు చేసిన పుస్తకాలు మా పాఠశాలలో ఉపయోగపడని, రూ.5 వేల నుండి రూ.8 వేలకు పైగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలు 25 శాతం ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు నిద్ర మత్తు వదిలి ప్రభుత్వ నిబంధనలను అమలు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు.










