Nov 28,2022 07:25

మౌనాన్ని పూనిన మనసుకు
ఆలోచనల పొంగుల్ని ఉప్పొంగిస్తూ
సందిగ్ధతను తరిమేస్తుంది
దారంతా చాచే కాళ్ళకు
ఏ చెట్టు బంధమో బంధించి
చేతులు చాచి పిలిచి
చల్లని గాలుల చరిష్మాని
చక్కలి గింతల సాంగత్యాన్ని అందిస్తాయి

ఒడ్డున నిలిచిన మది దేహాన్ని
అలలు ఆవేశపరచినా
సంద్రం సందేశ సామరస్య గీతాన్ని
వినిపించి మురిపిస్తుంది
పగలంతా ఆకలి పాటతో తిరిగే పక్షి
సాయంత్రం గూటి వైపు చేరుతూ
మధుర స్మతుల్ని గుప్తంగా దాచి
ధీరత్వాన్ని ప్రదర్శిస్తుంది

మేఘం కూడా సంద్రాన్ని తాకి
ఆకాశ నేస్తం అవుతుంది
ఆశల్ని నింపుకొని
నేలని నవ్వుతూ ముద్దాడుతూ
ముగ్ధ మనోహరంగా మురిసిపోయి
సరికొత్త సవ్వడులు భూమిపై
కొంగొత్తగా సంతరించుకొంటాయి..!

- మహబూబ్‌ బాషా చిల్లెం
9502000415