స్వయంగా వెళ్లి పంటనష్టం వివరాలను సేకరించాలి : కలెక్టర్ ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించండి
స్వయంగా వెళ్లి పంటనష్టం వివరాలను సేకరించాలి : కలెక్టర్
ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించండి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటను క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించి పంటనష్ట వివరాల అంచనాలను సిద్ధంచేయాలని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ తెలిపారు. గురువారం తుపాను సహాయ చర్యలు, నష్టంగణనకు సంబంధించి జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్, డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్‌తో కలసి సంబంధిత జిల్లా అధికారులతో జిల్లాకలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రతి రైతుకు చెందిన పంటను మండల, గ్రామ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పంట నష్ట గణన అంచనాలను సిద్ధం చేయాలని తెలిపారు. ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలని, అందుకు అనుగుణంగా ఆర్‌బికేలను అనుసంధానం చేసుకుని వివరాలను సేకరించాలని తెలిపారు. వర్షాల కారణంగా పశువులకు వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తచర్యగా వ్యాక్సినేషన్, డీవార్మింగ్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. జిల్లాలోని ఇరిగేషన్ ట్యాంకులు, చెరువులకు నీరు చేరుతున్నందున నీటినిల్వ సామర్థ్యాన్ని, ఆనకట్టలను నిరంతరం పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఎంపిడిఓలు, ఈఓపీఆర్డీలతో సమన్వయం చేసుకుని శానిటేషన్ పనులను పూర్తిస్థాయిలో నిర్వహించాలని డిపిఓను, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. ఆర్డిఓలు వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులు, తహశీల్దార్లతో సమన్వయము చేసుకుని ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కాజ్‌వేల వద్ద నీటిప్రవాహాన్ని, పారిశుధ్య పనులను పరిశీలించాలని తెలిపారు. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు అందవలసిన ఆర్ధిక సహాయం, నిత్యావసర సరుకులను అందించే ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ఇప్పటికే చాలా వరకు చెరువులు, ప్రాజెక్ట్ లు 75 శాతం నిండి ఉన్నాయని, వచ్చేవారం మరోసారి వర్షంపడే అవకాశం ఉన్నందున పట్టణాల్లో, గ్రామాల్లోని చెరువులలో నీరు బయటకు వెళ్ళే ఛానళ్ళలో అడ్డంకులను తొలగించే ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని తెలిపారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు మండల అధికారులతో సమన్వయం చేసుకుని కాజ్‌వేలు, కుల్వర్ట్‌లు, బ్రిడ్జిల కింద నీరు పారే మార్గాలను శుభ్రం చేయాలన్నారు. అలాగే చెరువుకట్టలు తెగే ప్రమాదం ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటికి మరమ్మతులు చేయాలని ఈ విధులను ఆర్డీఓలు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పుంగనూరు, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉన్నందున నీరు అధికంగా ప్రవహించే అవకాశం ఉన్నందున రోడ్లు వద్ద గల కల్వర్టులను శుభ్రం చేయాలని తెలిపారు.










