స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ప్రణాళికపై శిక్షణ
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: డిజిటల్ లావాదేవీల ద్వారా ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత ఉంటుందని డీఆర్డీఏ పీడీ తులసి తెలిపారు. గురువారం స్థానిక బివిరెడ్డి కాలనీలోని ఇండియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణాకేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ప్రణాళికా అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్డీఏ పీడీ మాట్లాడుతూ జిల్లాలో 3.5 లక్షల మంది ఎస్‌హెచ్‌జి గ్రూప్‌లకు సంబంధించిన సభ్యుల ఖాతాలు దేశ వ్యాప్తంగా గల ఎన్‌ఆర్‌ఎల్‌ఎంలో రిజిష్టర్ అయిందని తెలిపారు. స్వయం సంఘాల డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై బ్యాంక్ లింకేజీ అధికారులు గతంలో శిక్షణ పొందారని తెలిపారు. జిల్లాలోని ఎస్‌హెచ్‌జి సభ్యులకుగాను 300మంది సభ్యులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. వీరు జిల్లాలోని మిగిలిన సభ్యులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. డిజిటల్ లావాదేవీల వలన సంఘం ద్వారా సభ్యులు పొందే రుణాలు, చెల్లింపులు పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. సంఘంలోని సభ్యులు వారు పొదుపులో గల నిల్వలు పరిశీలించు కొనవచ్చునని, బ్యాంకుల ద్వారా వారు పొందే వివిధ రకాల రుణాలు దానికి సంబంధించి వడ్డీ, చెల్లింపు వివరాలను పరిశీలించుకొనవచ్చునని, చెల్లింపులను నేరుగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చునని తెలిపారు. ఎస్‌హెచ్‌జిల ద్వారా బ్యాంకుల్లో పొందుతున్న రుణాలు సకాలంలో చెల్లింపులు జరుగుతున్నవని తద్వారా రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు కూడా ముందుకు వస్తున్నారని తెలిపారు. సంఘానికి ఇచ్చే రుణాలు కాకుండా సంఘ సభ్యుల్లో ఇద్దరు ఎంటర్ ప్రన్యుయర్‌లకు కూడా దాదాపు ఒక్కొక్కరికి రూ.10లక్షల వరకు రుణాలు ఇస్తారని తెలిపారు. ఎల్‌డిఎం శేషగిరిరావు మాట్లాడుతూ ట్రైనింగ్ ద్వారా శిక్షణ పొందిన సభ్యులు మిగిలిన ఎస్‌హెచ్‌జి సంఘసభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు. ఇందుకు సంబంధించి ఆర్‌బిఐ వారు సమకూర్చిన మెటీరియల్‌ను గ్రూప్‌లకు అందించడం జరుగుతుందని, ఇందులో ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించిన అంశాలు ఉన్నాయని దీనిని అవగాహన చేసుకోవాలని తెలిపారు. నాబార్డ్ డిడిఎం సునీల్ మాట్లాడుతూ ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి ఇస్తున్న ఆరురోజుల శిక్షణాకార్యక్రమం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నదని తెలిపారు. మన రాష్ట్రంలో గతంలో కంటే అక్షరాస్యత మెరుగుగా ఉందని, అవకతవకలకు, మోసాలకు తావు లేకుండా ఆర్థిక లావాదేవీలలలో నిర్వహించుకొనుటకు ఫైనాన్షియల్ లిటరసీ అవసరమని తెలిపారు. యాప్ వాడకం ద్వారా వివిధ బ్యాంకుల నుంచి పొందుతున్న రుణాలు, వడ్డీ, లోన్ చెల్లింపు, పొడుపు ఖాతా వివరాలు మొదలగు వివరాలను తెలుసుకోనవచ్చునని తెలిపారు. ఇండియన్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ శ్రీనివాసన్, నిర్వాహకులు నాగేశ్వరరావు, అనిల్ కుమార్ పాల్గొన్నారు.










