Mar 07,2023 21:20

ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలో స్వల్పకాలిక వ్యవసాయ రుణాల కింద ఇప్పటి వరకు రూ.4,501 కోట్లు మంజూరు చేశారని, వీటిని అధిక సంఖ్యలో మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సూచించారు. ఈ ఏడాది రూ.6,250 కోట్లు స్వల్ప కాలిక రుణాల కింద వ్యవసాయానికి మంజూరు చేయాల్సి ఉండగా 72 శాతం మాత్రమే లక్ష్యం చేరుకోగలిగారన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా కన్సల్టెంటివ్‌ (డిసిసి), జిల్లాస్థాయి రివ్యూ కమిటీ (డిఎల్‌ఆర్‌సి) సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయ రుణాల కింద రూ.1671 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా రూ.36.71 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. వ్యవసాయ ఇన్‌ఫ్రాÛస్ట్రక్చర్‌ కింద రూ.423 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా రూ.1157 కోట్లు మంజూరు చేశారని కలెక్టర్‌ తెలిపారు. విద్యా రుణాల కింద రూ.75 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా కేవలం రూ.26.90 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి రూ.456.34 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా రూ.219.66 కోట్లు, ఇతర రుణాల కింద రూ.263.57 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా రూ.101.76 కోట్లు మాత్రమే మంజూరు చేశారని అన్నారు.
కౌలు రైతులకు ఎక్కువ మొత్తంలో రుణాలందించాలి
జిల్లాలో కౌలు రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో కౌలు రైతులకు ఎక్కువ మొత్తం రుణాలందించాలని కలెక్టర్‌ ప్రశాంతి సూచించారు. సిసిఆర్‌సి కార్డుదారులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. భూమి అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు భూయజమానికి రుణాలు మంజూరు చేయాలన్నారు. రైతులను జెఎల్‌ గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి అధిక మొత్తంలో రుణాలివ్వాలని సూచించారు. జిల్లాలో టిడ్కో గృహాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ బ్యాంక్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ 13,636 గృహాలకు సంబంధించి రూ.471.38 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 9,775 మందికి రూ.271.04 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు పూర్తిస్థాయిలో రుణాలందించాలని కలెక్టర్‌ చెప్పారు. జిల్లాలో 19,621 స్వయం సహాయక సంఘాలకు రూ.741.83 కోట్లు రుణాలందించాలని లక్ష్యం ఎంచుకోగా ఇప్పటి వరకు 17,246 సంఘాలకు రూ.1085.99 కోట్లు మంజూరు చేశారన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 2,406 స్వయం సహాయక సంఘాలకు రూ.72.77 కోట్లు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించగా 2,136 సంఘాలకు రూ.136.71 కోట్లు మాత్రమే రుణాలు మంజూరు చేశారని తెలిపారు. జిల్లాలో ఉత్పత్తి, సేవ, వ్యాపార రంగాలను ప్రోత్సహించేందుకు ముద్ర రుణాలు అధిక మొత్తంలో మంజూరు చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా అధికారులు, బ్యాంకర్లు సమావేశం నిర్వహించుకుని సమస్యలపై చర్చించుకుని వాటిని పరిష్కరించుకునేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి, ఆర్‌బిఐ ఎజిఎం ఆర్‌కె.అనుమకుమారి, నాబార్డు డిడిఎం అనిల్‌కాంత్‌, రీజనల్‌ హెడ్‌ యుబిఐ అండ్‌ డిజిఎం ఎంఎస్‌.రామారావు, ఎల్‌డిఎం ఎన్‌వివి.రమణ, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.