స్వీపర్లకు 'విలీన' కష్టాలు
జీతాల బిల్లు ఎవరు పెట్టాలి
విద్యాశాఖ..? మున్సిపాలిటీనా..?
ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్
నగర పాలక సంస్థ, పురపాలిక సంస్థల్లో పని చేస్తున్న స్వీపర్లకు విలీన కష్టం వచ్చిపడింది. మొన్నటి వరకు నగరపాలక సంస్థ, పురపాలిక సంస్థల పాఠశాలల్లో పని చేస్తున్న వారికి ఆయా నగర పాలక సంస్థ, పురపాలిక సంస్థలు జీతాలు ఇచ్చేవి. ప్రస్తుతం పుర, నగర పాలిక పాఠశాలలు విద్యాశాఖలో విలీనం కావడంతో జూలై నెల నుండీ జీతం బిల్లులు ఎవ్వరు పెట్టాలనేదే సమస్య. జూన్ వరకు పుర, నగర పాలిక సంస్థలు వారి పరిధిలోని పాఠశాలల్లో స్వీపర్లుగా పని చేస్తున్న వారికి జీతాలు ఇచ్చారు. జూన్ నుండీ విద్యాశాఖలో విలీనం కావడంతో జూలై నెల జీతాల బిల్లు పుర, నగర పాలిక సంస్థలు పెట్టాలా ... విద్యాశాఖ నుండీ చెల్లిస్తారా అనే విషయం తేల్చకపోవడంతో జిల్లాలో చిత్తూరు నగర పాలక సంస్థతో పాటు నగరి, కుప్పం, పలమనేరు, పుంగనూరు పురపాలిక ప్రాంతాల్లోని పుర, నగర పాలిక బడుల్లో పని చేస్తున్న స్వీపర్లు ఆందోళనకు గురౌతున్నారు. జీతాల విషయం ఆయా పాఠశాలల హెచ్‌ఎంలను అడిగితే ప్రభుత్వం నుండీ ఎలాంటి ఆదేశాలు అందలేదని విద్యాశాఖ లేక పుర, నగర పాలిక సంస్థలు చెల్లిస్తాయా అనే విషయం స్పష్టత లేకపోవడంతో జూలై నెల నుండీ జీతాలు వస్తాయా రావా అనే అందోళనలో స్వీపర్లు అయోమయంలో ఉన్నారు.
మున్సిపాలిటీలు ఏర్పడి నప్పటినుంచి మున్సిపాలిటీ పాఠశాలల్లో స్వీపర్లుగా నెలకు రూ. 100, 200 జీతానికి పని చేస్తున్న స్వీపర్లు సుదీర్ఘ పోరాటం తరువాత గుర్తింపు కార్డులు, పిఎఫ్ సాధించుకున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటి, నగరపాలక సంస్థ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లకు నెలకు రూ. 7,040 జీతం అందుతోంది. ఇందులో పిఎఫ్ క్రింద నెలకు రూ. 960 కట్ చేస్తున్నారు. పాఠశాల తెరవక ముందే చేరుకొని తరగతి గదులు, పాఠశాల ఆవరణం ఊడ్చి శుభ్రం చేయాలి. ఉదయం నుండీ సాయత్రం నాలుగు గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో 31 మున్సిపల్ పాఠశాలలున్నాయి. ఇందులో ఒక్కొ పాఠశాలకు ఒక్క స్పీపర్ చొప్పున 31 మంది పని చేస్తున్నారు. 1996 నుండీ పని చేస్తున్న వారున్నారు. ప్రభుత్వం పుర, నగర పాలక పాఠశాలలను విలీనం చేయడంతో జీతాల విషయంలో గందరగోళం నెలకొంది. విద్యాశాఖ, మన్సిపల్ అధికారులు స్వీపర్ల జీతాలు చెల్లించే విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
తొలగిస్తారనే ఆందోళన
జగమోహ్మన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖ, పుర, నగర పాలిక పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు మరుగుదొడ్ల కార్మికులను నియమించారు. ప్రభుత్వం నుండీ అందించే 'అమ్మఒడి' డబ్బుల నుండీ పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు నెలకు రూ. 1000 చొప్పున అమ్మఒడి నుండీ ఆయా పాఠశాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ డబ్బులతో మరుగుదొడ్లను శుభ్రం చేసేవారికి జీతాలు, మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నియమించిన వారికే పుర, నగర పాలక పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లును తొలగించి రెండు రకాల పనులు అంటే మరుగుదొడ్ల శుభ్రతతో పాటు స్వీపర్ పనులు కూడా అప్పగిస్తారనే ఆందోళన స్వీపర్లలో నెలకొంది. మరో వైపు పుర, నగర పాలక పాఠశాలల్లో ఏండ్ల తరబడీ పని చేస్తున్న స్వీపర్లను మున్సిపల్ పారిశుధ్య కార్మికులుగా మార్చేస్తారేమోనని స్వీపర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన విద్యాశాఖ, పుర, నగర పాలిక సంస్థలు పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్ల జీతాలు, పాఠశాలల్లో కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలని పుర, నగర పాలక పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లు కోరుతున్నారు.










