ప్రజాశక్తి-పీలేరు : క్యాంటీన్లో స్వచ్చత పాటించాలని పీలేరు ఆర్టీసీ డిపో మేనేజర్ బండ్ల కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ఆర్టీసి స్థితిగతులపై చర్చించారు. దీంతో స్పందించిన స్థానిక ఆర్టీసీ డిఎం మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని హోటళ్ళు, క్యాంటీన్, టీ అంగళ్లు, ఇతర వ్యాపార సముదాయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డియం మాట్లాడుతూ ప్రజలు, ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణ మనందరి సమిష్టి బాధ్యతని అన్నారు. ఈ విషయంలో దుకాణాలు, హోటల్ యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ప్రతి షాపు నిర్వాహకుడూ తమ తమ దుకాణాలు, పరిసరాల పరిశుభ్రతను పాటించిన్నప్పుడే మన బస్టాండ్ ఆవరణం స్వచ్ఛంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డిఎంతోపాటు ఎస్టీఐ సుధాకర్ నాయక్, టిఐ-2 రెడ్డప్ప, బస్ స్టేషన్ మేనేజర్ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.










