డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు
ప్రజాశక్తి - ఉండి
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. బుధవారం మండలంలోని కోలమూరు గ్రామంలో జల జీవన్ మిషన్ ద్వారా రూ.47 లక్షలతో నిర్మిస్తున్న పైప్‌లైన్, ఫిల్టర్ బెడ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కాకుండా మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ముఖ్యమంత్రి జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి నడింపల్లి సత్యవతి రామకృష్ణరాజు, ఎంపిటిసి పేరిచర్ల అరుణ భార్గవి, గ్రామ అధ్యక్షుడు పేరిచర్ల కేశవరాజు, వైసిపి నాయకులు గండ్రాజు రాజేష్ వర్మ, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.










