Aug 15,2023 21:45

జెండా వందనం చేసి మాట్లాడుతున్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్‌, పక్కన సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌

         ప్రజాశక్తి అనంతపురం కలెక్టరేట్‌   అనేకమంది త్యాగ ఫలితమే భారత స్వాతంత్య్రం సిద్ధించిందని.. పోరాట స్ఫూర్తిని కాపాడుకోవడం కోసం అందరూ కృషి చేద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ పిలుపునిచ్చారు. మంగళవా రం సిపిఎం నగర 1వ కమిటి ఆధ్వర్యంలో పాతూరు గాంధీ విగ్రహం వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బ్రిటీష్‌ వారిని దేశం నుంచి పారదోలడంలో ఏ పాత్రలేని పార్టీ నేడు దేశాన్ని పరిపాలిస్తోందన్నారు. వారు స్వాతంత్య్ర స్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అందరికీ విద్య, ఉద్యోగం, ఇల్లు, బట్ట, తిండి గ్యారెంటీగా ఉండాలంటే అందుకు స్వాతంత్రమే పరిష్కారమని నాటి జాతీయోద్యమం భావించిందన్నారు. అందుకనే కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించారని తెలిపారు. నేడు దేశాన్ని పాలిస్తున్న బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఈ ఉద్యమంలో విద్రోహ పాత్ర మాత్రమే ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు బ్రిటీష్‌ పాలకులకు లొంగిపోయి లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరుకున్నాడని గుర్తు చేశారు. మణిపూర్‌, హర్యానా రాష్ట్రాల్లో జరుగుతున్న మారణహౌమం దేశ ప్రతిష్టను మంట కలిపిందన్నారు. ఇలాంటి స్థితిలో మరోసారి స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వెంకటనారాయణ, సిఐటియు నగర అధ్యక్షులు బాబు, హమాలీ యూనియన్‌ నాయకులు సుబ్రమణ్యం, హమాలీ యూనియన్‌ నాయకులు ప్రసాద్‌, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.