స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్‌లో భాగంగా శనివారం ఉదయం స్థానిక పిసిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ పిసిఆర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర ఎస్.వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈఫోటో ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలను, వారు దేశం కోసం చేసిన త్యాగాలకు సంబంధించిన సమాచారాన్ని తిలకించారు. కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ అరుణ, డీఈఓ పురుషోత్తం, డిపిఓ లక్ష్మి, జిల్లా నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారిణి పద్మజ, జిల్లాసైనిక సంక్షేమ అధికారి విజరు శంకర్‌రెడ్డి పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్‌లో భాగంగా ఆగష్టు 1 నుండి 15 వరకు కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. తిరంగా ర్యాలీ, జిల్లాలోని చారిత్రిక కట్టడాలను సందర్శించడం, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించడం వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలుగా మనం స్వాతంత్య్రఫలాలను అనుభవిస్తున్నామంటే అందుకు ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలమని, ఆ త్యాగ నిరతిని మనం మననం చేసుకోవాలని అన్నారు. బ్రిటిష్ వారిపై భారతీయులు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకోవాలని తెలిపారు.










