శవాన్ని పూడ్చేదెలా..! శ్రీ దళిత శ్మశాన వాటికలో గ్రానైట్ వ్యర్థాలు శ్రీ జాతీయ రహదారిపై ధర్నా
శవాన్ని పూడ్చేదెలా..!
శ్రీ దళిత శ్మశాన వాటికలో
గ్రానైట్ వ్యర్థాలు
శ్రీ జాతీయ రహదారిపై ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
గ్రానైట్ వ్యర్ధాలు ఇష్టానుసారం దళితుల శ్మశాన వాటికలో పడేయడంతో శవాన్ని పూడ్చేందుకు ఇబ్బంది కావడంతో చిత్తూరు రూరల్ మండలం అనుపల్లి దళితవాడవాసులు శవంతో సహా చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిపై ధర్నాకు పూనుకున్నారు. దీంతో దాదాపు గంటసేపు ట్రాఫిక్ స్తంభించి కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి తహశీల్దార్ పార్వతమ్మ, టూటౌన్ పోలీసులు, రెవెన్యూ సర్వేర్ ధనుంజయ అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. గ్రానైట్ వ్యర్ధాలతో శ్మశానానికి దారిలేకుండా చేయడంతో పాటు శ్మశానాన్ని నింపేసిన వారిపై కఠినచర్యలు తీసుకునే అంతవరకు ధర్నా విరమించబోమంటూ అనుపల్లి దళితవాడ యూత్ అసోసియేషన్ నాయకులు రెవెన్యూ, పోలీస్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో శ్మశానదారిలో గ్రానైట్ వ్యర్ధాలను పడేసిన కనకరాజులు నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపటిలోగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి మృతుడి శవానికి అంత్యక్రియలు నిర్వహించారు.
సర్వే నంబర్ 511లో 13 సెంట్లు స్థలంలో అనుపల్లి దళితులు స్మశానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు వంద సంవత్సరాలుగా దళితవాడలో మరణించిన వారిని ఖననం చేస్తున్నారు. ఇటీవల కనకరాజు నాయుడు అనే వ్యక్తి శ్మశాన తనపొలానికి ఉన్న ఆరడుగుల దారిని 20అడుగులు వెడల్పు చేస్తూ జెసిబిలతో గ్రానైట్ వ్యర్థాలను శ్మశానదారిలో పడేస్తూ శ్మశానాన్ని నింపేశాడు. బుధవారం అనుపల్లి దళితవాడకు చెందిన ఎల్.సుబ్రమణ్యం మతి చెందాడు. మృతుని శవాన్ని ఖననం చేసేందుకు వెళ్లడా శ్మశానం గ్రానైట్ వ్యర్థాలతో నిండిపోవడంతో ఆగ్రహించిన దళితులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. అనంతరం రెవెన్యూ పోలీస్ అధికారుల హామీతో ధర్నా విరమించారు.
శ్మశానాలకు కంచి వేసి కాపాడండి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
జిల్లాలో ఉన్న దళితవాడల శ్మశానాలకు కంచి వేసి కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. గతంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో ప్రతి దళితవాడకు స్మశానం ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ నేటికీ అనేకచోట్ల శ్మశాన లేకపోవడం దారుణమని అన్నారు. రోజురోజుకీ భూఆక్రమణలు పెరుగుతున్నాయనటానికి నిదర్శనమే చిత్తూరు రూరల్ అనప్పపల్లి దళితస్మశానం. ఈ శ్మశానంలో గ్రానైట్ వ్యర్థాలతో నింపేశారు. శవాలను ఎలా పూడ్చాలని ప్రశ్నించారు. దళితులందరూ ఐక్యంగా రోడ్డుపై ఆందోళన చేశారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఒక్క అనప్పపల్లిలో కాదు జిల్లాలో అనేక దళితవాడలో ఇదే సమస్యతో సతమవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దళితువాడలో ఉన్న స్మశానాలను కాపాడాలని పట్టిక కంచి వేయాలి.










