Apr 05,2023 21:02

నరసాపురంలో జగనన్న మహిళా మార్ట్‌ ప్రారంభం
ప్రజాశక్తి - నరసాపురం
జగనన్న ఆసరా మహిళా మార్ట్‌ల ఏర్పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి.ప్రసాదరాజు అన్నారు. బుధవారం సబ్‌ కలెక్టరు కార్యాలయం వద్ద ఆధునికీకరణ చేసిన డ్వాక్రా బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన జగనన్న ఆసరా మహిళా మార్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌, ఐఎఎస్‌, సెర్ఫ్‌ సిఇఒ ఎఎండి.ఇంతియాజ్‌, జిల్లా కలెక్టరు ప్రశాంతితో కలిసి ప్రభుత్వ చీఫ్‌విప్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ పూర్తిగా డ్వాక్రా మహిళలే యజమానులుగా జగనన్న ఆసరా మహిళా మార్ట్‌ పేరుతో సూపర్‌ మార్కెట్లను ఏర్పాటు చేసిందన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్‌ విజయవంతమైందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మొదటిసారిగా నరసాపురం నియోజకవర్గంలో తొలి మహిళా మార్టును ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. పట్టణ, గ్రామ మహిళా సమాఖ్యలో సభ్యులుగా ఉన్న మహిళలే జగనన్న మహిళా మార్ట్‌కు యజమానులన్నారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజశేఖర్‌ మాట్లాడుతూ దీనికి అవసమైన సరుకుల సరఫరా కోసం కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు మెప్మా, వెలుగు శాఖలు సహకరిస్తున్నాయన్నారు. సూపర్‌ మార్కెట్లకు దీటుగా జగనన్న మహిళా ఆసరా మార్ట్‌లు ఉంటాయన్నారు. నిర్వహణ కోసం సమాఖ్యలోని 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తుందని, సమాఖ్య మార్ట్‌లో 10 మంది సిబ్బందిని నియమించుకుంటుందని తెలిపారు. ఈ మార్ట్‌లు ఆరునెలల్లోనే లాభాల్లోకి వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. సెర్ఫ్‌్‌ సిఇఒ ఎఎండి ఇంతియాజ్‌ మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పడి ఒక సంవత్సరం అయిన సందర్భంగా తొలిసారిగా తీర ప్రాంతంలో మహిళా మార్ట్‌ ఏర్పాటు చేయడం పట్టణ ప్రజలకే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు మంచి అవకాశం అని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో తణుకు, నరసాపురంలో మహిళా మార్ట్‌ లను పైలెట్‌ ప్రాజెక్టుగా మంజూరు కాగా తొలి ఆసరా మహిళా మార్టు నరసాపురంలో ప్రారంభించినందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నర్సాపురంలో 1914 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని, ఈ గ్రూపులకు సంబంధించి 19150 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఒక్కొక్క గ్రూప్‌ షేర్‌ ధనం రూ.2,110 వెచ్చించి రూ.30 లక్షలతో నరసాపురంలో మహిళా మార్టు ఏర్పాటు చేశారని ఆమె వివరించారు. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో మహిళా సాధికారతకు భరోసా కల్పించేందుకు మహిళా మార్ట్‌లు దోహదపడతాయన్నారు. తొలుత జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రభుత్వ చీఫ్‌విప్‌, వి రాజశేఖర్‌, ఇంతియాజ్‌, పి.ప్రశాంతి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ ఎం.సూర్యతేజ, డిఆర్‌డిఎ పీడీ ఎంఎస్‌ఎస్‌ వేణుగోపాల్‌, జిల్లా పంచాయతీ శాఖ అధికారి ఎం.నాగలత, డ్వామా పీడీ రాజేశ్వర రావు, మున్సిపల్‌ ఛైౖర్‌పర్సన్‌ బర్రి శ్రీవెంకటరమణ, ఎంపీపీ మైలాబత్తుల సోనీ పాల్గొన్నారు.