Mar 07,2023 21:22

ఎంఎల్‌సి ఎన్నికల శిక్షణలో పరిశీలకులు ఎస్‌.సురేష్‌కుమార్‌
ప్రజాశక్తి - ఏలూరు
ఉమ్మడి పశ్ఛిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకమని ఎన్నికల పరిశీలకులు, విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో సూక్ష్మ పరిశీలకుల విధులపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్బంగా మైక్రో అబ్జర్వర్లు, సంబంధిత అధికారులతో సురేష్‌కుమార్‌, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలును నిశితంగా పరిశీలించాలన్నారు. ఉల్లంఘన జరిగితే నివేదిక ఇవ్వాలన్నారు. సూక్ష్మ పరిశీలకులు తమ నివేదికలను నేరుగా ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. పోలింగ్‌ బూత్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పని చేయాలన్నారు. రిటర్నింగ్‌ అధికారితో సమన్వయం చేసుకుని పోలింగ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. ఏదైనా సమస్య, సంఘటన గురించి చెప్పాలనుకుంటే నేరుగా తమకుగాని, జిల్లా ఎన్నికల అధికారికిగాని తెలియజేయాలన్నారు. ప్రిసైడింగ్‌ అధికారి డైరీలో ఎన్నికల సంఘటన అంశాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారో, లేదో గమనించాలన్నారు. ఫొటో ఓటర్ల జాబితా నకలు ఒకటి తమ దగ్గర అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బ్యాలెట్‌ బాక్సుకు వేసిన సీళ్లు పరిశీలించాలన్నారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరా, వెబ్‌ కాస్టింగ్‌కు సంబంధించి రహస్య ఓటింగ్‌కు భంగం కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ఆయా అంశాలకు సంబంధించి ఏయే ఫార్మేట్లలో నివేదికలు ఇవ్వాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఏలూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఎం.సూర్యతేజ, ఏలూరు జిల్లా డిఆర్‌ఒ ఎవిఎన్‌ఎస్‌.మూర్తి, ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ఆర్‌డిఒలు కె.పెంచలకిషోర్‌, డి.రాజు, డాక్టర్‌ ఝాన్సీరాణి, మల్లిబాబు, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.బాలకృష్ణన్‌, ఏలూరు మున్సిపల్‌ కమిషనరు ఎస్‌.వెంకటకృష్ణ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జివివి.సత్యనారాయణ, డిఆర్‌డిఎ పీడీ ఆర్‌.విజయరాజు, డ్వామా పీడీ డి.రాంబాబు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు
ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణకు పోలీసు బందోబస్తు ఏర్పాట్లపై మూడు జిల్లాల ఎస్‌పిలతో ఎన్నికల పరిశీలకులు ఎస్‌.సురేష్‌ కుమార్‌ సమీక్షించారు. సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, ఏలూరు జిల్లా ఎస్‌పి రాహుల్‌దేవ్‌శర్మ, పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు, ఎస్‌ఇబి అదనపు ఎస్‌పి ఎన్‌.సూర్యచంద్రరావు పాల్గొన్నారు. సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ అక్రమ మద్యం రవాణా నిరోధించేందుకు ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు చెక్‌ పోస్టులను పటిష్టం చేయాలన్నారు.
ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధం
ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వసన్నద్దంగా ఉందని ఎన్నికల పరిశీలకులు ఎస్‌.సురేష్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఏలూరు ఎంపిడిఒ కార్యాలయంలో ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్‌ కేంద్రం, కౌంటింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. జిల్లా అధికారులు ఎన్నికల ఏర్పాట్లను ఆయనకు వివరించారు.